Engineering students | ఇంజినీర్లు అవుతారని పేరెంట్స్ ఆశిస్తే.. బైక్​ దొంగలయ్యారు..
Engineering students | ఇంజినీర్లు అవుతారని పేరెంట్స్ ఆశిస్తే.. బైక్​ దొంగలయ్యారు..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Engineering students : బీటెక్ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ (B.Tech Computer Engineering) ఫైనలియర్‌ విద్యార్థులు వారు. ఏడాది గడిస్తే.. పట్టా చేతికొచ్చి కొలువుల్లో స్థిరపడాల్సినవారు. కానీ, విలాసాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో డబ్బుల కోసం దొంగలుగా మారారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లో వెలుగుచూసింది.

ఒంగోలు Ongole సమీపంలోని క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (QUIS Engineering College) ఉంది. ఇందులో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్న ఏడుగురు విద్యార్ధులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. బుల్లెట్‌ వాహనాలను దొంగిలించడం మొదలెట్టారు. అలా ఏకంగా 16 బుల్లెట్‌ బైక్‌లు అపహరించారు. వీటి విలువ రూ. 25 లక్షల వరకు ఉంటుంది. చివరికి బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులకు చిక్కారు.

Engineering students : ఎలా అంటే..

అద్దంకి Addanki ఠాణా పరిధి సింగరకొండ Singarakonda తిరునాళ్లకు ఓ వ్యక్తి వచ్చాడు. ఈ క్రమంలో తన బుల్లెట్‌ బండిని హైవే మార్జిన్‌లో పార్క్‌ చేసి వెళ్లాడు. తిరునాళ్లకు వచ్చి చూస్తే తన వాహనం కనిపించలేదు. దామావారిపాలెం, చిన్నగానుగపాలెం, కాకానిపాలెం, సింగరకొండ గుడి, ఓల్డ్ ఆంధ్ర బ్యాంకు Andhra Bank ప్రాంతాలలోనూ ఇదే విధంగా వాహనాలు అపహరణకు గురయ్యాయి.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని బండ్లు కూడా ఒకే తరహాలో చోరీ అవుతున్నట్లు విచారణలో తేలింది. దీంతో బాపట్ల ఎస్పీ తుషార్ డూడి ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించారు.

అలా చీరాల Chirala డీఎస్సీ DSP ఎండీ మొయిన్‌ నేతృత్వంలో అద్దంకి పోలీసులు విచారణ చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బైక్‌ దొంగల ముఠాను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 16 బుల్లెట్​లు, ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దొంగిలించిన బండ్లలో కొన్నింటిని వాడుకుంటున్నారు. మరికొన్నింటిని విక్రయించేందుకు బ్రహ్మానంద కాలనీలోని పాత భవనంలో దాచిపెట్టారు. మంగళవారం(జులై 15) అద్దంలో బుల్లెట్ వాహనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒంగోలు, కందుకూరు Kandukur లోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్ధులుగా తేలింది.