అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Baby Girl | అక్రమ సంతానమో.. లేక కూతురు పుట్టిందని సాకలేకనో.. ఓ తల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. కళ్లు కూడా తెరువని పసికందును రోడ్డుపై పడేసింది. ఇంకా వెలుగును కూడా చూడని ఆ బిడ్డ బతుకును చీకట్లో కలిపేసింది. తన బతుకులోని చీకటి తొలగించుకునేందుకు, ఆ పసిబిడ్డ జీవితాన్ని అంధకారం చేసింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో (Nizamabad district headquarters) ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని ఆడ బిడ్డను ఓ తల్లి రోడ్డుపై పడేసి, చక్కగా చీకట్లో జారుకుంది. ఈ ఘటన మంగళవారం రాత్రి నగరంలోని నాలుగో ఠాణా పరిధిలో జరిగింది. చిన్నారిని రోడ్డుపై వదిలేయడంతో ఆ పసికందు లేత చర్మంపై గాయాలయ్యాయి.
Baby Girl | పెళ్లి కాని యువతినా..?
పద్మానగర్ 100 ఫీట్ల రోడ్డుకు వెళ్లేదారిలో ఓ యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ఆ చిన్నారిని అక్కడే రోడ్డుపై వదిలేసి, ఆ తల్లి పారిపోయింది. స్థానికులు గమనించి దగ్గరకు తీసుకున్నారు.
తల్లి ఎదపై వెచ్చగా సేద తీరాల్సిన ఆ శిశువు చీకట్లో గుక్కపట్టి ఏడవడాన్ని చూసి చలించిపోయారు. పాపకు పాలు పట్టి జో కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో చిన్నారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, పెళ్లి కాని యువతి గర్భం దాల్చి, ఇలా పసికందును కని వదిలేసినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డి తెలిపారు. చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు.