అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prakash Raj | ఒకప్పుడు పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఇద్దరు కలిసి పలు సినిమాలు చేసి అలరించారు. అయితే పవన్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుండి పవన్‌కు పలు సందర్భాలలో కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు ప్రకాశ్ రాజ్(Prakash Raj).
గతంలో పలుమార్లు పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించిన ప్రకాశ్ రాజ్ ఇప్పుడు తన సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేశాడు. దీంతో పవన్ – ప్రకాశ్ రాజ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే .. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) హిందీ భాషపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Prakash Raj | భాష కోసం ఫైట్..
హైదరాబాద్ గచ్చిబౌలి(Hyderabad Gachibowli)లో జరిగిన రాజ్యభాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న పవన్, “మన మాతృభాష అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ. హిందీ భాషను ప్రేమిద్దాం, ముందుకు తీసుకెళ్దాం” అంటూ హిందీకి మద్దతుగా వ్యాఖ్యానించారు.
హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని మనం అడ్డుకున్నట్టు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. హిందీలో డబ్ అయిన 31% దక్షిణాది సినిమాలు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి కదా, మరి వ్యాపారానికి హిందీ కావాలి కానీ, నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నల వర్షం గుప్పించారు.
ఈ నేపథ్యంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్.. పవన్ వీడియోను షేర్ చేస్తూ “ఈ రేంజ్‌కీ అమ్ముకోవడమా? ఛీ.. ఛీ..” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రకాశ్ ట్వీట్‌పై నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తెలుగువారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ పూర్తి స్పష్టత ఇవ్వాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు..“హిందీ(Hindi Language)ని బలవంతంగా రుద్దడం సరైన విధానం కాదని, ప్రతీ భాషకు సమాన గౌరవం ఉండాలి అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలని పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఈ వివాదం ఇక్కడే ఆగేలా కనిపించడం లేదు.