అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indiramma Canteen | హైదరాబాద్ (Hyderabad) నగరంలో రూ.5కే అందిస్తున్న భోజనం తిని ఎంతో మంది కడుపు నింపుకుంటున్నారు. అన్నపూర్ణ క్యాంటిన్ల(Annapurna Canteen) పేరుతో నిత్యం మధ్యాహ్నం రూ.5కే జీహెచ్ఎంసీ భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ క్యాంటిన్ల పేరును ఇందిర్మ క్యాంటిన్లుగా ప్రభుత్వం మార్చింది. భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా రూ.5కే అందించాలని నిర్ణయించింది.
Indiramma Canteen | అందించే టిఫిన్లు..
ఇందిరమ్మ క్యాంటిన్లలో (Indiramma Canteen) రూ.5కే టిఫిన్ అందించనున్నారు. వారానికి ఆరు రోజులు ఆరు రకాల అల్పాహారం అందించాలని జీహెచ్ఎంసీ (GHMC) నిర్ణయించింది. ఈ మేరకు మెనూ విడుదల చేసింది. ఒక రోజు మూడు మిల్లెట్ ఇడ్లీలు, సాంబర్, చట్నీ అందించనున్నారు. రెండో రోజు మిల్లెట్ ఉప్మా, సాంబర్, చట్నీ, మూడో రోజు పొంగల్–సాంబర్, నాలుగో రోజు ఇడ్లీ–సాంబర్, చట్నీ, ఐదో రోజు పొంగల్–సాంబర్, చట్నీ, ఆరో రోజు పూరీలు – ఆలు కుర్మ అందించనున్నారు. ఇడ్లీలు, పూరీలు మూడు చొప్పున అందించనున్నారు. అలాగే పొంగల్, ఉప్మా అయితే 250 గ్రాముల చొప్పున రూ.5కే అందించేలా మెనూ రూపొందించారు.
Indiramma Canteen | కొత్తగా 150 కేంద్రాలు
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం అన్నపూర్ణ భోజన పథకం పేరుతో 138 కేంద్రాలు పని చేస్తున్నాయి. 2013 నుంచి ఈ పథకం ద్వారా రూ.5కే భోజనం అందిస్తున్నారు. ప్రస్తుతం నిత్యం 30 వేల మంది ఈ కేంద్రాల్లో భోజనం తిని కడుపు నింపుకుంటున్నారు. హరేకృష్ణ సంస్థ(Hare Krishna Organization) ఈ క్యాంటిన్లను నిర్వహిస్తోంది. ప్రజలు భోజనానికి రూ.5 చెల్లిస్తుండగా.. జీహెచ్ఎంసీ ఒక్కో ప్లేట్‌కు రూ.28 చొప్పున సంస్థకు చెల్లిస్తోంది. తాజాగా ప్రభుత్వం వీటి స్థానంలో ఇందిరమ్మ క్యాంటిన్లు తీసుకు రావాలని నిర్ణయించింది. మొత్తం 150 కేంద్రాలను జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. వీటిలో భోజనంతో పాటు, టిఫిన్ కూడా అందిస్తామని తెలిపింది. ఇటీవల ప్రభుత్వం ఉదయం అల్పాహారం కార్యక్రమానికి రూ.10 కోట్లు కేటాయించింది. త్వరలో వీటిని ప్రారంభించనున్నారు.