అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistanis : పాకిస్తానీయులు భారతదేశం విడిచి వెళ్లడానికి కేంద్రం గడువును విధించిన విషయం తెలిసిందే. దీనిని పాటించని వారికి అరెస్టు, ప్రాసిక్యూషన్, మూడేళ్ల వరకు జైలు శిక్ష / రూ. 3 లక్షల వరకు జరిమానా.. లేదా రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఏప్రిల్ 22న.. జమ్మూ కశ్మీర్లోని పహల్ గామ్ లో పాకిస్తాన్తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులకు భారతదేశం విడిచి వెళ్లమంటూ ఆదేశాలు జారీ చేసింది. సార్క్ వీసాలు కలిగి ఉన్నవారు ఏప్రిల్ 26లోపు వెళ్లిపోవాలంది, వైద్య వీసాలు ఉన్న పాకిస్తానీయులు ఏప్రిల్ 29లోపు వెళ్లిపోవాలని ఆదేశించింది.
ఈ మేరకు ఆదివారం నాటికి వెళ్లిపోవాల్సిన 12 కేటగిరీల వీసాలలో వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికులు, గ్రూప్ యాత్రికుల వీసాలు ఉన్నాయి.
ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం 2025 ప్రకారం, వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో ఉండడం, వీసా షరతులను ఉల్లంఘించడం లేదా నిషేధిత ప్రాంతాలలోకి అతిక్రమించిన నేరం కింద.. మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 3 లక్షల వరకు జరిమానా విధించబడుతుందని కేంద్రం హెచ్చరించింది.