అక్షరటుడే, వెబ్డెస్క్: YS Jagan | రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్(YSRCP Chief Jagan) అన్నారు. బుధవారం ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డు(Bangarupalyam Market Yard)ను సందర్శించారు. మామిడి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో మామిడి పంటకు గిట్టుబాటు ధర వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు(Mango Farmers) కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
YS Jagan | రైతులను కలవకుండా ఆంక్షలు
తాను రైతులను కలవకుండా ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని జగన్ విమర్శించారు. రైతుల జీవితాలను నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే రైతులపై కుట్ర చేయడం దారుణమన్నారు.రైతులను రౌడీషీటర్లతో పోలుస్తారా అని ప్రశ్నించారు. రైతు సమస్యలపై మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారని పేర్కొన్నారు.
YS Jagan | అక్కడే కేంద్రమే కొంటుంది
రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని జగన్ అన్నారు. కర్ణాటకలో కేజీ మామిడి రూ.16కు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కర్ణాటకలో కేంద్రం కొనుగోలు చేస్తుంటే ఇక్కడ చంద్రబాబు(Chandra Babu) గాడిదలు కాస్తున్నారా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మామిడి రైతులకు కిలోకు రూ.12 కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వమే మామిడి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో కేజీ మామిడి రూ.22 నుంచి రూ.29కి కొనుగోలు చేసినట్లు చెప్పారు.
YS Jagan | రైతులకు అండగా ఉంటాం
రాష్ట్రంలో రైతులకు ఇప్పటి వరకు పెట్టుబడి సాయం, ఇన్ పుట్ సబ్సిడీ(Input Subsidy) అందలేదని జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో అగ్రి టెస్ట్ ల్యాబులు(Agri Test Labs) నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. రైతుల తరఫున వైసీపీ పోరాటాలు చేస్తుందన్నారు. ప్రతి రైతుకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా రైతులపై లాఠీఛార్జీ చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలు,లంచాలకు పోలీసులు లొంగిపోవద్దన్నారు. పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేస్తారని జగన్ అన్నారు.