అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indigo Flight | ఓ పక్షి విమాన ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది. గాలిలో ఉండగా.. విమానాన్ని పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన పట్నాలో చోటుచేసుకుంది. ఇటీవల తేనేటీగల గుంపు కారణంగా విమానం ఆలస్యంగా బయలు దేరిన విషయం తెలిసిందే. సూరత్ విమానాశ్రయం(Surat Airport) నుంచి జైపూర్ వెళ్తున్న ఇండిగో విమానం(Indigo Flight) లగేజీ డోర్ దగ్గరకు తేనేటీగల గుంపు రావడంతో గంట ఆలస్యం అయింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. తాజాగా మరో ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొనడం గమనార్హం.
పట్నా ఎయిర్‌పోర్టు(Patna Airport) నుంచి ఇండిగో విమానం బుధవారం ఢిల్లీ బయలు దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఫ్లైట్‌ను పక్షి(Bird) ఢీకొంది. దీంతో అప్రమత్తమైన పైలెట్ పట్నా ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండింగ్(Emergency Landing) చేశారు. ఆ సమయంలో ఫ్లైట్‌లో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. పక్షి ఢీకొనడంతో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. విమానానికి మరమ్మతులు చేస్తున్న అధికారులు.. మరో విమానంలో ప్రయాణికులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల పట్నా నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానాన్ని సైతం పక్షి ఢీకొన్న విషయం తెలిసిందే. గతంలోనూ పక్షులు ఢీకొనడంతో పలు విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
Indigo Flight | ప్రయాణికుల్లో ఆందోళన
అహ్మదాబాద్‌లో ఇటీవల ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదలో 270 మంది మరణించారు. ఈ ప్రమాదం అనంతరం విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత వరుసగా సాంకేతిక సమస్యలతో పలు విమానాలు నిలిచిపోయాయి. దీంతో విమానం ఎక్కాలంటేనే ప్రజలు జంకుతున్నారు. తాజాగా విమాన ప్రయాణికులను పక్షులు సైతం కలవర పెడుతున్నాయి.