అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lords Cricket Pitch | భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ (Test Series) అత్యంత ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో టీమ్స్ ఒక్కో గెలుపుతో 1-1తో సమంగా నిలిచాయి. బ్యాటింగ్ ఆధిపత్యం చాటుతూ భారీ స్కోర్లు నమోదైన ఈ సిరీస్ ఇప్పుడు మూడో టెస్టు కోసం లార్డ్స్‌కు చేరుకుంది. అయితే ఎడ్జ్‌బాస్టన్‌లో ఘోర పరాజయం తర్వాత, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(England captain Ben Stokes), కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ ఇద్దరూ లార్డ్స్‌లో “మరింత పేస్, బౌన్స్” పిచ్ కావాలని కోరినట్లు తెలుస్తుంది. జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ లాంటి పేసర్లు ఇంగ్లండ్ జట్టు(England Team)లోకి తిరిగొచ్చిన క్రమంలో బౌలింగ్‌లో మెరుపువేగంతో దాడి చేసి బ్యాట్స్‌మెన్స్‌ను వణికించేందుకు ప్రణాళిక వేస్తున్నారు.
Lords Cricket Pitch | పిచ్‌పై ఫోకస్..
గత నెలలో లార్డ్స్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పేసర్లు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో, అదే తరహా పిచ్‌ను ఇప్పుడు ఇంగ్లండ్ కోరుకుంటుందని అంటున్నారు. లార్డ్స్‌లోని ఎనిమిది అడుగుల వాలు, పచ్చని గడ్డి బ్యాట్స్‌మెన్‌లకు నిజమైన సవాలును విసిరే అవకాశం లేకపోలేదు. అయితే, రెండో టెస్టులో విశ్రాంతి తీసుకున్న జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మూడో టెస్టుకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ వంటి పేసర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఒకవేళ పిచ్ పేసర్‌లకు అనుకూలించినా టీమిండియా(Team India) బౌలింగ్ దళం ఇంగ్లండ్‌కి ధీటుగా బదులివ్వడం ఖాయం.
ఫస్ట్ టెస్ట్ (లీడ్స్)లో భారత్ 471, 364 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 465, 373/5 చేసింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 1,673 పరుగులు నమోదయ్యాయి. ఇక రెండో టెస్ట్ లో భారత్ – 587 & 427/డిక్లేర్ చేయగా, ఇంగ్లాండ్ – 407 & 271 పరుగులు చేసింది. ఇందులో 1692 పరుగులు నమోదయ్యాయి. అంటే కేవలం ఈ రెండు మ్యాచ్‌లలో మొత్తం 3,365 పరుగులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు లార్డ్స్ పిచ్(Lords Pitch) లో అంత భారీ స్కోర్స్ నమోదయ్యే అవకాశం లేదని అంటున్నారు. మొదటి రెండు రోజుల పాటు స్వింగ్, బౌన్స్ ఎక్కువగా ఉండే అవకాశముంది. ప్రారంభంలో బ్యాటింగ్ చేయడం కష్టం కావొచ్చు. పిచ్ పాతబడిన కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు: 310 పరుగులు కాగా, ఈ మైదానంలో 344 పరుగుల కంటే ఎక్కువ టార్గెట్ ఎప్పుడూ ఛేదించింది లేదు.