అక్షరటుడే, వెబ్‌డెస్క్: Krishna River | కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కొత్త నీటితో ఉవ్వెత్తున ఎగిసి ప్రవహిస్తోంది. లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహంతో దిగువకు పరుగులు పెడుతోంది. మరోవైపు, గోదావరి జలకళ లేక బోసిపోతోంది. వరద ప్రవాహం లేక వెలవెలబోయి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు జీవనాధారమైన రెండు ప్రధాన నదులు కృష్ణ(Krishna River), గోదావరి (Godhavari) పరివాహక ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితి నెలకొంది.
Krishna River | ఉరుకలెత్తుతోన్న కృష్ణమ్మ..
కృష్ణ నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉప్పొంగుతోంది. ఎగువన ఉన్న కర్ణాటక(Karnataka)లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో వరద నీటితో కృష్ణ పరుగులు పెడుతోంది. ప్రియదర్శిని జురాల ప్రాజెక్టుకు 1.25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగవకు వదిలి పెడుతున్నారు. ఈ జలాలు శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project)కు చేరడంతో అక్కడ కూడా నాలుగు గేట్లను ఎత్తివేశారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. 1,16,424 క్యూసెక్కుల వరద వస్తుండగా, 4,646 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుతం 534.50 అడుగుల నీరు నిల్వ ఉంది.
Krishna River | బోసిపోయిన ఎగువ గోదావరి
మరోవైపు వరదల్లేక గోదావరి బోసిపోయి కనిపిస్తోంది. మహారాష్ట్ర(Maharashtra)లో పెద్దగా వర్షాలు కురియక పోవడంతో వరద ప్రవాహాలు రావడం లేదు. బాబ్లీ గేట్లు ఎత్తినా ఇప్పటిదాకా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెద్దగా వరద వచ్చింది లేదు. ఎస్సారెస్పీ(SRSP)కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్‌ఫ్లో రావడం లేదు. కేవలం 4291 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1067 అడుగులు (19.537 టీఎంసీలు) మాత్రమే నీటి నిల్వ ఉంది. ఈ నెలలో కేవలం 8 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ఎగువన ఇలా ఉంటే, దిగువ గోదావరిలో మాత్రం ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 1.11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.