అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BRS Party | బీఆర్ఎస్ పార్టీ సమస్యలతో సతమతమవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. అవినీతి ఆరోపణలపై కొనసాగుతోన్న విచారణల పర్వం ప్రతిపక్ష పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేసింది. అదే సమయంలో ఆధిపత్య పోరు గులాబీ పార్టీని చిక్కుల్లోకి నెట్టేసింది. దీంతో ముఖ్య నాయకత్వం ఫ్రస్టేషన్‌కు గురవుతుండగా, కేడర్ అయోమయంలో పడిపోయింది.
BRS Party | తెలంగాణ సాధించిన పార్టీగా..
దశాబ్దాల కల అయిన ప్రత్యేక తెలంగాణ(Telangana) రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా క్రెడిట్ సొంతం చేసుకున్న బీఆర్ఎస్.. ఆ సెంటిమెంట్‌తో రెండుసార్లు అధికారం దక్కించుకుంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికల్లో, 2018 చివర్లో జరిగిన ఎలక్షన్లలోనూ గులాబీ గుబాళించింది. పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్(BRS).. తొలి ఐదేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలతో ప్రజల్లో మంచి పేరు సాధించింది. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలతో క్రమంగా దూరం జరగడం మొదలైంది. కొంత మంది నేతల వ్యవహార శైలి మారడం, జనాల్ని లెక్క చేయకపోవడం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలు.. వెరసి మొత్తంగా బీఆర్ఎస్పై అసహనం పెరిగింది. అదే సమయంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్(Congress)ను గద్దెనెక్కించారు.
BRS Party | చక్రబంధంలో బీఆర్ఎస్..
అధికారం కోల్పోయిన నాటి నుంచి గులాబీ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, బీఆర్ఎస్ను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. గత పదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ సర్కారు(Congress Government) విచారణకు ఆదేశించింది. వరుసగా జరుగుతున్న విచారణలతో బీఆర్ఎస్ లో అలజడి మొదలైంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)పై ప్రధానంగా ఫోకస్ చేసింది.
అదే సమయంలో రూ.లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రపంచ ప్రసిద్ధ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్(Justice Ghosh Commission)ను నియమించింది. అలాగే, హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన ఈ కార్ రేస్ వ్యవహారంలో అనుమతి లేకుండా రూ.50 కోట్లు మళ్లించిన వ్యవహారంపైనా దర్యాప్తుకు ఆదేశించింది.
విద్యుత్ కొనుగోళ్ల విషయంలోనూ విచారణ చేపట్టింది. తద్వారా బీఆర్ఎస్ ను చక్రబంధంలో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. కాళేశ్వరం విచారణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Chief KCR), మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) విచారణకు హాజరు కాగా, ఈ కార్ రేసు వ్యవహారంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయా అంశాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకుల పాత్ర ఉండడం, వారిని జైలుకు పంపిస్తారన్న ప్రచారం జరుగుతుండడం గులాబీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది.
BRS Party | ఆధిపత్య పోరు..
ఇప్పటికే వరుస విచారణలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్య పోరుతో సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధానంగా కేసీఆర్ కుటుంబంలోనే ఈ జగడం కొనసాగుతుండడం పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. కేసీఆర్ ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) నేరుగానే పార్టీ నాయకత్వంపై విమర్శలు ఎక్కుపెడుతుండడం కేడర్‌లో గందరగోళంలోకి నెట్టేసింది. కవిత, కేటీఆర్(KTR) మధ్య కొనసాగుతోన్న ఆధిపత్య పోరు పార్టీ బీఆర్ఎస్ను చిక్కుల్లోకి నెట్టేసింది. అన్న, చెల్లి మధ్య అంతరం ఏర్పడిన తరుణంలో హరీశ్‌రావుకు ప్రాధాన్యం పెరిగింది.
వివిధ అంశాలపై సమర్థవంతంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ వస్తున్నారు. మరోవైపు, బీసీ నినాదం అందుకున్న కవిత.. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తన వంతు పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ఆధిపత్య పోరులో కేటీఆర్ కాస్త వెనుకబడ్డారని, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఆయన అందుకే సవాళ్ల పర్వానికి తెర లేపాడన్న భావన వ్యక్తమవుతోంది.
నీళ్లు, నిధులు, నియామకాలు సహా ఏ అంశంపై అయినా అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమని సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు సవాల్ విసరగా, కేటీఆర్ అనవసరంగా స్పందించగా, ప్రెస్‌క్లబ్ వేదికగా మంగళవారం రచ్చ రచ్చ చేసి పొలిటికల్ మైలేజ్ పొందేందుకు యత్నించారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా పదేళ్ల పాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్.. ఇప్పుడు వరుస విచారణలు, అంతర్గత సమస్యలతో చిక్కుల్లో పడిందని చెప్పవచ్చు.