Telangana Politics
Telangana Politics | | బీసీల చుట్టే రాజ‌కీయం.. అన్ని పార్టీల‌దీ అదే పాట‌..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Politics | రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పుడు ఒక‌టే పాట పాడుతున్నాయి. బీసీ నినాదాన్ని బ‌లంగా వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నిక‌ల్లో (upcoming elections) గంప‌గుత్త‌గా ఓట్లు రాబ‌ట్టుకునేందుకు కొత్త ఎత్తుగ‌డలు వేస్తున్నాయి. బీసీ వ‌ర్గాల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు మూడు ప్ర‌ధాన పార్టీలు పావులు క‌దుపుతున్నాయి.

బీసీలకు న్యాయం జ‌ర‌గాల‌ని, వారికి అన్నింట్లోనూ అవ‌కాశాలు ఇవ్వాల‌ని కాంగ్రెస్‌ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ పార్టీలు (BRS party) గొంతెత్తుతున్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ రాష్ట్రంలో కుల గ‌ణ‌న చేప‌ట్టి, బీసీ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అటు బీజేపీ కూడా దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించింది. పైగా తాము రాష్ట్రంలో అధికారంలో బీసీనే ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ కూడా ఇప్పుడు బీసీ నినాదం వినిపిస్తోంది. దీంతో రాష్ట్ర రాజ‌కీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి.

Telangana Politics | కాంగ్రెస్ బీసీల పాట‌..

దాదాపు రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బీసీ పాట పాడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు నుంచే కాంగ్రెస్ బీసీ నినాదాన్ని త‌ల‌కెత్తుకుంది. రాహుల్‌గాంధీ త‌న జోడో యాత్ర‌లో కుల గ‌ణ‌న, బీసీల‌ అంశాన్ని లేవ‌నెత్తారు. ఆ త‌ర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలోనూ కాంగ్రెస్ బీసీ నినాదాన్ని బ‌లంగా వినిపించింది. తాము అధికారంలోకి వ‌స్తే కుల గ‌ణ‌న నిర్వ‌హించి బీసీల లెక్క తేలుస్తామ‌ని, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచుతామ‌ని ప్ర‌క‌టించింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో దీన్ని బ‌లంగా జ‌నంలోకి తీసుకెళ్ల‌డంతో కాంగ్రెస్ భారీగా లాభ‌ప‌డింది. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చింది.

బ‌ల‌మైన బీఆర్ఎస్​ను ఓడించి తెలంగాణ‌లో మూడు రంగుల జెండా ఎగరేసింది. రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి (CM Revanth reddy) అయ్యాక ఇచ్చిన హామీ మేర‌కు రాష్ట్రంలో కులగ‌ణ‌న నిర్వ‌హించారు. బీసీల‌కు విద్యా, ఉద్యోగావ‌కాశాల‌తో పాటు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. త‌ద్వారా వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ ఓట్ల‌ను రాబ‌ట్టుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంది.

Telangana Politics | బీజేపీ బీసీ ముఖ్య‌మంత్రి..

భార‌తీయ జ‌న‌తా పార్టీ (Bharatiya Janata Party) కూడా బీసీ నినాదాన్ని బ‌లంగా వినిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ.. బీసీ నాయ‌కుడిని ప్ర‌ధాని ప‌ద‌విలో కూర్చోబెట్టామ‌ని చెబుతోంది. మ‌రోవైపు, కొన్నాళ్లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న జ‌నగ‌ణ‌న‌ను నిర్వ‌హించేందుకు అంగీక‌రించిన కేంద్రం.. కుల గ‌ణ‌న కూడా చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించింది. త‌ద్వారా దేశంలో ఉన్న బీసీల లెక్క తేల్చేందుకు సిద్ధ‌మైంది. ఇక‌, రాష్ట్రంలోనూ బీసీ అంశంపై బ‌లంగా ఫోక‌స్ చేస్తోంది. అధికారంలోకి వ‌స్తే బీసీ నాయ‌కుడినే ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని బీజేపీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి రాష్ట్ర అధ్య‌క్షుడిగా బీసీకే ఇవ్వాల‌ని భావించిన‌ప్ప‌టికీ, పార్టీలో ఆధిప‌త్య పోరు కార‌ణంగా సంఘ్ నేప‌థ్య‌మున్న రాంచంద‌ర్‌రావు (BJP state president Ramachandra Rao) అవ‌కాశం క‌ల్పించింది. అయిన‌ప్ప‌టికీ, రానున్న రోజుల్లో ముఖ్య ప‌ద‌వులు బీసీల‌కే ఇస్తామ‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

Telangana Politics | బీఆర్ఎస్ ది అదే మాట‌..

ప‌దేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా బీసీల పాట పాడుతోంది. అధికారంలో ఉన్న‌ప్పుడు కేవ‌లం అగ్ర‌వ‌ర్ణాల‌కే పెద్ద‌పీట వేసిన గులాబీ పార్టీ.. మిగతా పార్టీల కార‌ణంగా త‌న వైఖ‌రి మార్చుకోవాల్సి వ‌చ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత (BRS MLC Kavita) ఇప్పుడు సామాజిక న్యాయం పేరిట ఊరూరా తిరుగుతున్నారు. గ‌త ప‌దేళ్ల‌లో సామాజిక న్యాయం చేయ‌లేక పోయామ‌ని, కానీ ఇక నుంచి బీసీల‌కు న్యాయం చేయాల‌నే లక్ష్యంతో పోరాడ‌తామ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆమె ప‌లు జిల్లాల్లో బీసీ స‌ద‌స్సులు నిర్వ‌హించారు. ఇక‌, మిగ‌తా బీఆర్ఎస్ నాయ‌కులు బీసీల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని, అన్ని రంగాల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేలా ప్ర‌య‌త్నిస్తామ‌ని చెబుతున్నారు.

మొత్తంగా ఓట్ల కోసం మూడు ప్ర‌ధాన పార్టీలు ఓట్ల కోసం బీసీ నినాదాన్ని త‌ల‌కెత్తుకున్నాయి. బీసీలే కేంద్రంగా రాజకీయాలు నెరుపుతున్నాయి.

Read all the Latest News on Aksharatoday.in