అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ (Hyderabad) నగరంలో జీహెచ్‌ఎంసీ (GHMC) ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు చేశారు. డెయిరీ సెంటర్లు (Dairy Centers), పలు హాస్టళ్లలో దాడులు చేశారు. 48 డెయిరీ సెంటర్లలో సోదాలు చేశారు. 56 శాంపిల్స్ సేకరించిన అధికారులు నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేశారు. పలు ఉత్పత్తులపై లేబుల్స్ లేనట్లు గుర్తించారు.
కూకట్‌పల్లి (Kukatpalli)లోని హాస్టళ్లలో జీహెచ్‌ఎంసీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ట్రేడ్, ఫుడ్ లైసెన్స్‌లు లేకుండా హాస్టళ్లు నడుపుతున్నారనే సమాచారంతో తనిఖీలు చేశారు. నకిలీ ట్రేడ్ లైసెన్సుతో నడుపుతున్న ఆర్జేవీ లేడీస్ హాస్టల్ (RJV Ladies Hostel)ను సీజ్ చేశారు. ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా హాస్టల్ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు.
Hyderabad | కనీస వసతులు కరువు
హైదరాబాద్ నగరంలో చాలా హాస్టళ్లలో (Hostels) కనీస వసతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీటెక్ విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రీపేర్ అయ్యే ఏరియాల్లో ఉండే హాస్టళ్లను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత పాటించడం లేదు. నాసిరకం సరుకులతో వంటలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తుండటంతో పలువురు హాస్టల్ నిర్వాహకుల్లో భయం పట్టుకుంది.