ePaper
More
    HomeతెలంగాణLocal Body Elections | ప‌ల్లె పోరుకు కాంగ్రెస్ రెడీ.. సామాజిక స‌మ‌ర భేరీ స‌భ‌తో...

    Local Body Elections | ప‌ల్లె పోరుకు కాంగ్రెస్ రెడీ.. సామాజిక స‌మ‌ర భేరీ స‌భ‌తో స‌న్నాహాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | స్థానిక పోరుకు కాంగ్రెస్ స‌మాయాత్త‌మైంది. సామాజిక స‌మ‌ర భేరీ(Samara Bheri) పేరిట నిర్వ‌హించిన స‌భ‌తో.. స‌మ‌రానికి సిద్ధమ‌న్న సంకేతాలు పంపించింది. ప‌ల్లెల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌న్న ల‌క్ష్యంతో జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

    త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న పంచాయతీ ఎన్నిక‌ల(Panchayat Elections) నేప‌థ్యంలో అధికార పార్టీ వేగంగా పావులు క‌దుపుతోంది. అందులో భాగంగానే రైతుభ‌రోసా (Rythu Bharosa) ప‌థ‌కాన్ని అతి త‌క్కువ స‌మ‌యంలోనే పూర్తి చేసింది. అదే స‌మ‌యంలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగ‌వంతం చేసింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున‌ ఖ‌ర్గేను రాష్ట్రానికి ఆహ్వానించి హైద‌రాబాద్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

    Local Body Elections | వ్యూహాత్మ‌క అడుగులు

    అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన బీఆర్ఎస్​ను ఓడించి కాంగ్రెస్ అనూహ్యంగా అధికారంలోకి వ‌చ్చింది. అన్ని విధాలుగా హ‌స్తం పార్టీని తొక్కేయాల‌ని కేసీఆర్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంది. వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌ల‌తో.. విజ‌యగ‌ర్వంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంది. రేవంత్‌రెడ్డి గ‌ద్దెనెక్కిన అనంత‌రం ప్ర‌తిప‌క్షాల నుంచి ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తూ రాష్ట్రంలో పాల‌న‌పై ప‌ట్టు పెంచుకున్నారు. ఒక్కొక్క అడుగు జాగ్ర‌త్త‌గా వేస్తూ విప‌క్షాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించారు. రానున్న స్థానిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌య‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు.

    Local Body Elections | ప‌థ‌కాల్లో వేగం..

    తెలంగాణ‌(Telangana)లో మిగ‌తా పార్టీల‌తో పోల్చుకుంటే బీఆర్ఎస్ ఇప్ప‌టికీ బ‌లంగా ఉంది. ప‌ల్లెల్లో గులాబీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. అయితే, వివిధ విచార‌ణ‌ల‌తో బీఆర్​ఎస్ నాయ‌క‌త్వాన్ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government).. ప‌ల్లెల్లోనూ ప‌ట్టు పంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే సంక్షేమ ప‌థ‌కాల‌ను వేగ‌వంతం చేసింది. కేవ‌లం తొమ్మిది రోజుల్లోనే రైతులంద‌రికీ రైతుభ‌రోసా సాయం అంద‌జేసింది. ఆర్థిక ప‌రిస్థితులు దారుణంగా ఉన్న‌ప్ప‌టికీ రూ.9 వేల కోట్లను రైతు ఖాతాల్లో వేసి, వారిని త‌మ వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేసింది. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ఇందిర‌మ్మ ఇళ్లలో (Indiramma House) వేగం పెంచింది. ఎన్ని ఇబ్బందులు ఎదుర‌వుతున్నా మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తూ.. అతివ‌ల ఓట్ల‌పై క‌న్నేసింది. మ‌రోవైపు అడ‌పాద‌డ‌పా నియామకాల ప‌త్రాలు అంద‌జేస్తూ యువ‌త‌ను త‌న‌వైపు తిప్పుకుంటోంది. ఆర్థిక స‌వాళ్లు ఉన్న‌ప్ప‌టికీ ప‌థ‌కాల కొన‌సాగింపుతో ప్ర‌జ‌ల్లో బ‌లమైన ముద్ర వేసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది.

    Local Body Elections | విప‌క్షాలకు ఎదురొడ్డి..

    మ‌రోవైపు, విప‌క్షాలు చేస్తున్న రాజ‌కీయ విమ‌ర్శ‌లకు కాంగ్రెస్ అంతే దీటుగా స‌మాధాన‌మిస్తోంది. ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీని రెండింటిని ఎదుర్కొంటూ త‌న‌దైన శైలిలో దూసుకుపోతోంది. ముఖ్యంగా బీఆర్ ఎస్(BRS) చేస్తున్న వాద‌న‌ల‌కు బ‌ల‌మైన కౌంట‌ర్ ఇస్తూ ఆ పార్టీని ప‌లుచ‌న చేసేందుకు య‌త్నిస్తోంది. గులాబీ నాయ‌క‌త్వాన్ని చ‌క్ర‌బంధంలో ఇరికించేందుకు ఇప్ప‌టికే వివిధ అంశాల‌పై విచార‌ణ‌లు జ‌రుపుతోంది. నీళ్లు, నిధులు, నియామ‌కాల‌ విష‌యంలో బీఆర్ఎస్ చేస్తున్న దాడిని దీటుగా తిప్పికొడుతోంది. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు (Banakacharla Project) పేరిట తెలంగాణ సెంటిమెంట్​ను రెచ్చగొట్టేందుకు చేసిన ప్ర‌య‌త్నాలకు బ‌లంగా కౌంట‌ర్ ఇస్తోంది. ఇక‌, బీజేపీ విమ‌ర్శ‌ల‌ను కూడా అధికార పార్టీ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. కేంద్రం రాష్ట్రానికి ఏమాత్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని, ఎన్నిసార్లు వెళ్లి విజ్ఞ‌ప్తి చేసినా న‌యా పైసా ఇవ్వ‌డం లేద‌ని బీజేపీని టార్గెట్ చేసింది. విప‌క్షాల‌ను దీటుగా ఎదుర్కొంటూ.. బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇప్ప‌టికే రాష్ట్రంలో బీసీ గ‌ణ‌న పూర్తి చేసిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. బీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రం కోర్టులోకి నెట్టేసింది. త‌ద్వారా బీజేపీ(BJP)ని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేసింది. ఇలా ఒక్కో అడుగు జాగ్ర‌త్త‌గా వేస్తూ ప‌ల్లె పోరుకు కాంగ్రెస్ స‌న్నాహాలు చేస్తోంది.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...