అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajasthan | రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మర్ జిల్లాలో (Barmer district) ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తీవ్రంగా మనస్తాపానికి గురైన ఓ దంపతులు, తమ ఇద్దరు చిన్నారులతో కలిసి నీటి కుంటలో దూకిఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకోగా, అందులో ఓ తల్లి తన చిన్న కుమారుడిని ఆడపిల్లలా అలంకరించి తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (social media) హృదయాన్ని కలచివేస్తోంది. బార్మర్‌కు చెందిన శివ్లాల్ మేఘ్వాల్ (35), అతని భార్య కవిత (32), ఇద్దరు కుమారులు బజరంగ్ (9), రామ్‌దేవ్ (8) మంగళవారం రాత్రి నుంచి కనిపించలేదు. అయితే బుధవారం ఉదయం వారి ఇంటి సమీపంలోని నీటి ట్యాంకులో ఈ నలుగురి మృతదేహాలు తేలుతూ కనిపించాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు (Police) సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
Rajasthan | ఫ్యామిలీ అంతా..
శివ్లాల్ ఇంట్లో పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన తల్లి, తమ్ముడు, మరో బంధువు తమను మానసికంగా వేధించారని ఆరోపించాడు. “ప్రధాన మంత్రి అవాస్ యోజన (Pradhan Mantri Awas Yojana) కింద వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టాలనుకుంటే, వాటా ఇవ్వకుండా అడ్డుపడ్డారు. గౌరవం లేదు, స్వేచ్ఛ లేదు. నరకంగా మారింది జీవితం” అని తన ఆవేదనను నోట్‌లో వ్యక్తం చేశాడు. అంతేకాక, తమ అంత్యక్రియలు ఇంటి ఎదుటే జరిపించాలని కోరడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలో హృదయాలను పిండేసిన దృశ్యం.. తల్లి కవిత (Kavita) తన చిన్న కుమారుడు రామ్‌దేవ్‌ను చివరి సారి ముద్దుగా ముస్తాబు చేయడం. తలపై తన చీర దుపట్టా చుట్టి, కళ్లకు కాటుక దిద్ది, తన బంగారు నగలతో అతన్ని ఆడపిల్లలా తయారుచేసింది.
ఆ తర్వాత పసివాడిని తనతో మృత్యుఒడిలోకి తీసుకువెళ్లింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచి వేస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు (Case registered) చేసి, సూసైడ్ నోట్‌లో పేర్కొన్న వ్యక్తులపై విచారణ మొదలు పెట్టారు. ఒక చిన్నపాటి ఆస్తి విషయంలో ఇంతటి విషాదం చోటు చేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఈ ఘటన సమాజానికి గుణపాఠంగా నిలవాలి. కుటుంబాల్లో ఆస్తి వివాదాల కన్నా ప్రేమే విలువైనదని గుర్తించాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.. కానీ ప్రాణాలకు ప్రత్యామ్నాయం ఉండదు. సూసైడ్ ఆలోచనలు వస్తే.. ఆలోచించి సమస్య పరిష్కరించుకోవాలే తప్పా ఆత్మహత్య పరిష్కారం కాదని పలువురు పేర్కొంటున్నారు.