అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పురోగతి సాధించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. బుధవారం ఆర్మూర్ మున్సిపాలిటీని (Armoor Municipality) సందర్శించి, పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఆశించిన స్థాయిలో ప్రగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 617 మందికి ఇళ్లు మంజూరు చేయగా.. కేవలం 183 మందికి సంబంధించి మాత్రమే గ్రౌండింగ్ జరిగిందన్నారు. అధికారులు, వార్డ్ ఆఫీసర్ల పనితీరును ఆక్షేపించారు. పరిస్థితి ఇలాగే ఉంటే లక్ష్యాన్ని ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు మెప్మా ఆధ్వర్యంలో రుణాలు ఇప్పించేలా చొరవ చూపాలని సూచించారు. ఇప్పటికే మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారికి మూడు రోజుల్లో.. కొత్తగా సభ్యత్వం కల్పించే వారికి వారం వ్యవధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.లక్ష వరకు రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు.
Indiramma Housing Scheme | వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవాన్ని (Vana mahotsavam) విజయవంతమయ్యేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. నర్సరీలో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉంచాలని, వాటిని పరిరక్షించేలా అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. గత సీజన్లో నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. అలాగే వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శుక్రవారం అన్ని నివాస ప్రాంతాల్లో.. వ్యాపార వాణిజ్య సంస్థల్లో విధిగా డ్రైడే పాటించేలా చూడాలన్నారు. అనంతరం పట్టణంలోని 11, 12 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను కలిశారు. కలెక్టర్ వెంట మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.