అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cordelia Cruise | సముద్ర తీర ప్రాంతాన్ని చూస్తే అలలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. దీంతో తీర ప్రాంతాల్లోని బీచ్‌లలో నిత్యం పర్యాటకుల సందడి నెలకొని ఉంటుంది. పర్యాటకుల కోసం బీచ్ ఒడ్డున ఎన్నో ఫైవ్ స్టార్ హోటళ్లు వెలిశాయి. అయితే ఫైవ్ స్టార్ హోటల్(Five Star Hotel) సముద్రంలో తేలుతూ ఉంటే ఎలా ఉంటుంది. అదే కార్డేలియా విహార నౌక.. ఫైవ్ స్టార్ హోటల్ వసతులతో ఈ క్రూయిజ్‌లో అలలపై ప్రయాణించవచ్చు.
సముద్రంలో షిప్లో ప్రయాణిస్తే ఆ అనుభవం వేరు. ఎంతో మంది షిప్లో ప్రయాణించాలని అనుకుంటారు. వీరి కోసం కార్డేలియా విహార నౌక(Cordelia Cruise Ship) అందుబాటులోకి వచ్చింది. ఫైవ్ స్టార్ వసతులతో బయట ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రశాంతంగా ఈ నౌకలో ప్రయాణించవచ్చు.
Cordelia Cruise | టూరిజం కేంద్రంగా..
రానున్న రోజుల్లో పర్యాటక రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు టూరిజం డెవలప్మెంట్(Tourism Development)పై చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం విశాఖపట్నాన్ని అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా మార్చాలని సంకల్పించింది. ఇటీవల విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.80 కోట్లతో నిర్మించిన ఈ టెర్మినల్‌ను ఇటీవల కేంద్ర మంత్రి ప్రారంభించారు. తాజాగా ఈ టెర్మినల్‌లోకి అంతర్జాతీయ పర్యాటక నౌక కార్డేలియా వచ్చింది.
Cordelia Cruise | 1100 మంది పర్యాటకులతో..
కార్డేలియా క్రూయిజ్ సంస్థ కార్డేలియా విహార నౌకను నడుపుతోంది. ఇది చెన్నై– విశాఖపట్నం– పుదుచ్చేరి– చెన్నై మధ్య నడుస్తోంది. చెన్నై నుంచి పర్యాటకులతో బయలుదేరిన ఈ నౌక బుధవారం ఉదయం విశాఖ(Visakhapatnam) తీరానికి చేరుకుంది. ఇందులో 796 క్యాబిన్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 1800 మంది పర్యాటకులు ప్రయాణించే అవకాశం ఉంది. అయితే తొలి ట్రిప్‌లో 1100 మందితో విశాఖ చేరుకుంది.
Cordelia Cruise | గతంలోనే ప్రారంభం
వైసీపీ హయాంలో 2022లో కార్డేలియా నౌక విశాఖ తీరానికి వచ్చింది. అప్పుడు కూడా చెన్నై–విశాఖ–పుదుచ్చేరి మీదుగా ఈ విహార నౌకను నడిపారు. అప్పుడు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ నౌక పర్యాటకుల కోసం అందుబాటులో ఉంది. తాజాగా జూన్ 30 మళ్లీ చెన్నై నుంచి క్రూయిజ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా జులై 2న విశాఖ చేరుకుంది. మళ్లీ ఈ నెల 9, 16 తేదీల్లో ఈ నౌక విశాఖ తీరానికి చేరుకోనుంది. చెన్నై-విశాఖ- పుదుచ్చేరి-చెన్నై మధ్య మూడు సర్వీసులు ఈ నెలలో నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది. జూన్ 30న చెన్నై నుంచి బయలు దేరిన షిప్ జులై 2న విశాఖ టెర్మినల్(Visakhapatnam Terminal)కు చేరుకుంది. సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరి 4న పుదుచ్చేరికి వెళ్తుంది. అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి 5న చెన్నైకి చేరడంతో ఒక ట్రిప్పు పూర్తవుతుంది.