అక్షరటుడే, వెబ్‌డెస్క్:Srisailam Temple | శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం(Srisailam Mallikarjuna Swamy Temple) లడ్డూ ప్రసాదంలో బొద్దింక (కీటకం) ఉందని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు భక్తులలో కలకలం రేపినా, ఇప్పుడు వాటిపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఫ్యాక్ట్ చెక్ టీమ్ మరియు దేవస్థానం అధికారులు స్పందిస్తూ అసలు నిజాన్ని వెల్లడించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా(Nellore District) కావలికి చెందిన ఓ భక్తుడు, తాను కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందని ఆరోపించాడు. అయితే, దేవస్థానం వర్గాలు దీన్ని తప్పుడు ప్రచారంగా కొట్టి పారేశాయి. లడ్డూ తయారీ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందని పేర్కొన్నాయి.
Srisailam Temple | బాగోతం బయటపడిందిగా..
లడ్డూ తయారీ సందర్భంగా సిబ్బంది తలపై క్యాప్‌లు, చేతులకు గ్లౌజులు ధరించి మాత్రమే పనిచేస్తారు. ప్రసాదం తయారీకి ఉపయోగించే పదార్థాల నాణ్యతను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. కాబట్టి, లడ్డూ(Laddu)లో బొద్దింకలు పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇక వివరాలను పరిశీలించిన అధికారులకు ఆ రోజు 6వ కౌంటర్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్‌లో కీలక విషయం తెలిసింది. ప్రసాదంపై ఆరోపణలు చేసిన వ్యక్తి కాసేపు అక్కడ ఎవరి కోసమో ఎదురు చూస్తూ నిలుచున్నాడు. అప్పటికే లడ్డూలు కొనుగోలు చేసిన మరో ఇద్దరు వ్యక్తులు అతడి వద్దకు వచ్చి ఒక కవర్ ఇచ్చారు. ఆ కవర్లో కావాలనే కీటకం ఉంచి, లడ్డూకి అంటించినట్లు తెలుస్తోంది.
అనంతరం వారిలో ఒకరు సెల్‌ఫోన్‌తో ఈ దృశ్యాలను వీడియో తీసి ఒక టీవీ ఛానల్‌కి పంపించారు. అదే వీడియో జూన్ 29న మధ్యాహ్నం 3:58 గంటలకు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. మరో విషయం ఏమిటంటే.. దర్శనానికి వెళ్లే భక్తులకు మొబైల్ ఫోన్లు అనుమతించరు. అంటే, వీళ్లు కావాలనే బయటకు వెళ్లి ఫోన్ తీసుకొని మళ్లీ కౌంటర్‌కు వచ్చి ఈ కథనాన్ని ప్లాన్ చేశారు అని అధికారులు వెల్లడించారు. ఆరోపణలు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఆరోపణ చేసిన వ్యక్తితో పాటు మరొక ముగ్గురు కలిసి ఆలయానికి వచ్చారని గుర్తించారు. వీరి చర్యలు ఆలయ ప్రతిష్టను దిగజార్చే కుట్రగా అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్నిసీరియస్‌గా తీసుకొని, కుట్రలో పాల్గొన్నవారినే కాకుండా ఇది నడిపించిన వారి గురించి కూడా విచారణ చేయనున్నట్లు వెల్లడించారు. భక్తులలో అపోహలు కలిగించే విధంగా అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.