ePaper
More
    HomeతెలంగాణTelangana BJP | కమలంలో కుంపట్లు.. విభేదాలు బయటపెట్టిన అధ్యక్ష పదవి ఎన్నిక

    Telangana BJP | కమలంలో కుంపట్లు.. విభేదాలు బయటపెట్టిన అధ్యక్ష పదవి ఎన్నిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana BJP | తెలంగాణ బీజేపీలో గూడు కట్టుకున్న ఆధిపత్య పోరు బయటపడింది. పార్టీలో అంతర్గతంగా కొనసాగుతోన్న అసమ్మతి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో వెలుగు చూసింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన నాటకీయ పరిణామాలు అసలు సిసలైన కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురి చేశాయి. పార్టీలో నెలకొన్న విభేదాలు సీనియర్ నేత, కట్టర్ హిందూ అయిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Raja Singh) రాజీనామాకు దారి తీశాయి. మరోవైపు, కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి కొందరు సీనియర్ నాయకులు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం కొత్తగా మొదలైందన్న ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అలాగే, చంద్రబాబు నాయుడు చెప్తే అధ్యక్షుడ్ని పెట్టే పార్టీ బీజేపీ కాదన్న బండి(Bandi Sanjay) వ్యాఖ్యలు కాషాయ దళంలో అంతర్గత చర్చకు దారి తీశాయి.

    Telangana BJP | పోటీలో లేని వ్యక్తికి పదవి..

    రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఎంపీలు ఈటల రాజేందర్(Eatala Rajender), అర్వింద్ ధర్మపురి(Arvind Dharmapuri), రఘునందన్ రావు వంటి వారితో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పదవిని ఆశించారు. తమకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు. అయితే, బీజేపీ ఇటీవల బీసీ సామాజికవర్గానికి పెద్దపీట వస్తున్న తరుణంలో ఈటల, అర్వింద్​లలో ఒకరికి అవకాశం లభిస్తుందని ప్రచారం జరిగింది. సీనియర్ నాయకుడు, అనుభవంతో పాటు ముదిరాజ్ కులస్తుడైన ఈటల పార్టీ పెద్దలను కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు, బీఆర్ఎస్ హవాలోనూ రెండుసార్లు ఎంపీగా గెలిచి, ఆ పార్టీతో ఎదురొడ్డి పోరాడని వ్యక్తిగా అర్వింద్ పేరు కూడా రేసులో వినిపించింది. బీజేపీ ముఖ్యులతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో అర్వింద్​కు పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సీనియర్ నాయకుడు రాంచందర్ రావు పేరును బీజేపీ ఖరారు చేయడం పార్టీలో కలకలం రేపింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

    Telangana BJP | రాజాసింగ్ రాజీనామా..

    తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న వేళ ఆ పార్టీలో కలవరం మొదలైంది. అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసేందుకు వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా(Resignation) చేస్తూ లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి పంపించారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. అధ్యక్ష ఎన్నిక తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాను రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్లితే.. తనను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇక తాను బీజేపీ(BJP)లో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. తనకు మద్దతు ఇస్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ తన అనుచరులను కొందరు బెదిరించారని ఆరోపించారు.

    Telangana BJP | బీజేపీ స్వయంకృతాపరాధం..

    గతానికి భిన్నంగా బీజేపీ వ్యవహార శైలి కొనసాగుతుండడం ఆ పార్టీ శ్రేణులను గందరగోళం పడేసింది. కొంత మంది నేతల మాటే చెల్లుబాటు అవుతుండడం, రాజాసింగ్‌, బండి సంజయ్, అర్వింద్ లాంటి కట్టర్‌ కార్యకర్తలను పక్కకు నెట్టేస్తుండడం కాషాయ శ్రేణుల్లో మరోసారి చర్చనీయాంశమైంది. వాస్తవానికి బండి సంజయ్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ కొత్త ఊపు తీసుకొచ్చారు. కొన్ని దశాబ్దాలుగా ముక్కుతూ మూలుగు సాగుతున్న పార్టీని పరుగులు పెట్టించారు. పట్టణాలు, నగరాలకే పరిమితమైన బీజేపీని పల్లెలకు చేర్చారు. కేసీఆర్‌ లాంటి మహా ఘటికుడికి కంట్లో నలుసులా తయారయ్యారు. ఇక, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనుకుంటున్న తరుణంలో అధిష్టానం అనూహ్యంగా ‘బండి’ని తప్పించింది. మెత్తగా వ్యవహరిస్తారన్న కిషన్‌ రెడ్డి(Kishan Reddy)కి బాధ్యతలు అప్పగించింది. ఇక, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పూర్తి స్థాయిలో పోరాడకుండా రాష్ట్ర నాయకత్వం చప్పబడి పోయింది. దీంతో పార్టీ శ్రేణులు ఢీలా పడ్డాయి. అటు అధ్యక్షుడిగా ఎన్నికవుతారని భావించిన అర్వింద్, ఈటలకు కూడా బీజేపీలో పొగ బెట్టే ప్రయత్నాలు జరగడం కలకలం రేపాయి. బీజేపీ అధికారంలోకి రాకూడదని పార్టీలోని కొందరు పెద్ద నాయకులు అడ్డు పడుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించడానికి పార్టీలో జరుగుతున్న పరిణామాలే కారణమని చెబుతున్నారు.

    Telangana BJP | ముందే ఊహించిన అధిష్టానం

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి(BJP State President) ఎంపిక విషయంలో మొదటి నుంచి తీవ్ర గందరగోళం నెలకొంది. చాలా మంది ఈ పదవి కోసం పోటీ పడడంతో అధిష్టానం అయోమయంలో పడింది. బండి సంజయ్​ని తప్పించాక రాష్ట్ర పార్టీలో క్రమశిక్షణ అదుపు తప్పింది. కొందరు నేతలు గ్రూపులు కట్టడం, పార్టీకి వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం హైకమాండ్ దృష్టికొచ్చింది. మరోవైపు, చాలా మంది అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తుండడంతో గత రెండేళ్లుగా ఎటూ తేల్చకుండా వాయిదా వేస్తూ వచ్చింది. అయితే, జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిన తరుణంలో తప్పనిసరై రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను చేపట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించిన అధిష్టానం అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిని ఎంచుకుంది. అర్వింద్ ను అధ్యక్షుడ్ని చేస్తే ఇతరుల నుంచి అభ్యంతరాలు వస్తాయని, ఈటలకు బాధ్యతలు అప్పగిస్తే సీనియర్ల నుంచి విమర్శలు వస్తాయన్న భావనతో సౌమ్యుడైన రాంచందర్ రావు(Ramchandra Rao)ను తెర పైకి తీసుకొచ్చింది.

    More like this

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...