అక్షరటుడే, వెబ్‌డెస్క్: CPI Narayana | కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) నక్సలైట్లను చంపగలరేమో కానీ, నక్సలిజాన్ని మాత్రం చంపలేరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నక్సలైట్లతో చర్చలు ఉండవని అమిత్ షా ఆదివారం నిజామాబాద్(Nizamabad) పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై ఆయన తాజాగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టిన ఆయన కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నక్సలైట్లను చంపగలరు కానీ, నక్సలిజాన్ని(Naxalism) అంతం చేయలేరని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చిలోగా నక్సలిజాన్ని అంతం చేస్తామని అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదమని నారాయణ పేర్కొన్నారు.
CPI Narayana | సిద్దాంతాన్ని చంపలేరు..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నారాయణ(CPI Narayana) ఖండించారు. నక్సలైట్లను అమిత్ షా చంపొచ్చు, కానీ నక్సలిజాన్ని కాదని పేర్కొన్నారు. మనుషుల్ని చంపినంత మాత్రాన నక్సలిజం అంతం అవ్వదని తేల్చి చెప్పారు. నక్సలిజం ఓ సిద్ధాంతమని, దాన్ని అంతం చేయడం ఎవరితోనూ సాధ్యం కాదన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వేళ్లూనుకున్న నక్సలైట్లను(Naxalites) ఎలా అంతం చేస్తారని ప్రశ్నించారు. అలాగే, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మిలితమైన నక్సలిజాన్ని అంతం చేయలేరని స్పష్టం చేశారు. మనుషులను చంపవచ్చేమో కానీ సిద్ధాంతాన్ని చంపలేరన్నారు.
నక్సలైట్లు తక్షణమే హింసను విడనాడి లొంగిపోవాలని, జన జీవన స్రవంతిలో కలవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. నక్సలైట్లు గిరిజన బిడ్డలను, పోలీసులను చంపినప్పుడు వారి తరఫును ఎవరూ మాట్లాడలేదన్నారు. కానీ ఇప్పుడు చర్చల కోసం చాలా మంది పిలుపునిచ్చారని.. చర్చల జరపాలన్న వారిని ఉద్దేశించి విమర్శించారు. ఆయుధాలు వీడే దాకా వారితో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10 వేల మంది నక్సలైట్లను లొంగిపోయారని చెప్పారు.