ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | కంచికి చేర‌ని క‌థ‌లెన్నో.. విచార‌ణల పేరిట ప్ర‌భుత్వాల కాల‌యాప‌న‌

    Phone Tapping Case | కంచికి చేర‌ని క‌థ‌లెన్నో.. విచార‌ణల పేరిట ప్ర‌భుత్వాల కాల‌యాప‌న‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Phone Tapping Case | తెలంగాణ‌లో కీల‌క అంశాలపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వ‌రం, విద్యుత్ కొనుగోళ్లు.. ఇలా ముఖ్య‌మైన విష‌యాల‌పై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు న‌డుస్తోంది. గ‌త ప‌దేళ్ల‌లో అనేక రంగాల్లో అవినీతి జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌భుత్వం ద‌ర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. కాళేశ్వ‌రం క‌మిష‌న్‌(Kaleshwaram Commission)తో పాటు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాలు విచార‌ణ కొన‌సాగిస్తున్నాయి. అయితే రోజులు గ‌డుస్తున్నా ఈ విచార‌ణ‌ల క‌థ‌లు కంచికి చేర‌డం లేదు. దోషులు ఎవ‌రో తేల‌డం లేదు. వాస్త‌వానికి ఇప్పుడే కాదు గ‌త గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలోనూ జ‌రిగిన విచార‌ణ‌ల సంగ‌తి కూడా అలాగే త‌యారైంది. ఇందిర‌మ్మ ఇండ్లు, డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం(Drug Dealing), నయీం ముఠా ఆగ‌డాల‌పై గ‌తంలో విచార‌ణ‌లు కొన‌సాగినా, దాన్ని ఎటూ తేల్చ‌లేదు. నాలుగు రోజులు హ‌డావుడి చేయ‌డం, ఆ త‌ర్వాత ప‌క్క‌న ప‌డేయ‌డం ష‌రామామూలై పోయింది.

    Phone Tapping Case | అనేక విచార‌ణ‌లు..

    కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ‌త ప్ర‌భుత్వ హయాంలో జ‌రిగిన అవినీతిపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ పాల‌న‌లో అనేక విమ‌ర్శలు ఎదుర్కొన్న వాటిపై ఫోక‌స్ చేసింది. కేసీఆర్(KCR) హ‌యాంలో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్‌(Phone Tapping), విద్యుత్ కొనుగోళ్లపై ఫిర్యాదులు రావ‌డంతో విచార‌ణ‌కు ఆదేశించింది. బీఆర్ఎస్‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు పై మొద‌టి నుంచి అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ ప్రాజెక్టు క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి ఏటీఎంగా మారింద‌ని ప్ర‌ధాని మోదీ(Prime Minister Modi) నుంచి కాంగ్రెస్ నేత‌లు, మేధావులు అందరూ ఆరోపించారు. మ‌రోవైపు, ప్రాజెక్టు మూడేళ్ల‌కే కుంగిపోవ‌డం, అప్ప‌టికే అనేక ఆరోప‌ణ‌లు రావ‌డంతో రేవంత్ స‌ర్కారు విచార‌ణ కోసం జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్‌(Justice PC Ghosh Commission)ను ఏర్పాటు చేసింది. మ‌రోవైపు, గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన విద్యుత్ కొనుగోళ్ల‌లోనూ అవినీతి జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌పైనా విచార‌ణ‌కు ఆదేశించింది. ఇక‌, దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌, రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ విచార‌ణ కోసం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. గ‌త నెల రోజులుగా ట్యాపింగ్ అంశం తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

    Phone Tapping Case | దోషులు తేలెదెన్న‌డో..

    కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర దాటిపోయింది. ఏడాదిగా విచార‌ణ‌ల పర్వం కొనసాగుతోంది. కానీ ఇప్ప‌టికీ ఏ అంశం కూడా కొలిక్కి రాలేదు. కాళేశ్వ‌రం క‌మిష‌న్‌కు గ‌డువు పొడిగిస్తూ వ‌స్తూనే ఉన్నారు. ప్ర‌స్తుతం ఫోన్ ట్యాపింగ్ విచార‌ణ జోరుగా కొన‌సా..గుతోంది. కీల‌క నిందితులను ప్ర‌శ్నించిన‌ప్ప‌టికీ, అస‌లు సూత్ర‌ధారులకు ఇప్ప‌టికీ నోటీసులు జారీ చేయ‌లేదు. ఈ క‌థ ఇప్ప‌ట్లో తేలేలా లేదు. ఇక విద్యుత్ కొనుగోళ్ల అంశం ఎప్పుడూ మ‌రుగున ప‌డిపోయింది. గ‌తంలోనూ ఇలాగే విచార‌ణ‌ల పేరిట హ‌డావుడి చేశారు. ఆ త‌ర్వాత వ‌దిలేశారు. 2004-2014 వ‌ర‌కు ప‌దేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హ‌యాంలో నిర్మించిన‌ ఇందిర‌మ్మ ఇళ్ల‌లో తీవ్ర అవినీతి జ‌రిగింది. 2018లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇందిర‌మ్మ ఇండ్ల అక్ర‌మాల‌పై విచార‌ణ‌కు ఆదేశించింది. వేలాది కోట్ల అవినీతి జ‌రిగింద‌ని సాక్షాత్తు అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. కానీ, ఏం జ‌రిగిందో కానీ, విచార‌ణ‌ను అట‌కెక్కించారు. ఇక రౌడీషీట‌ర్ న‌యీం ముఠా(Nayeem Gang) ఆగ‌డాల‌పైనా ఇలాగే విచార‌ణ‌కు ఆదేశించారు. నాలుగు రోజులు బాధితుల నుంచి వివ‌రాలు సేరించారు. ఆ త‌ర్వాత ఆ ద‌ర్యాప్తు ఏమైందో ప్ర‌భుత్వానికే తెలియాలి. ఇక‌, అప్ప‌ట్లో రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన డ్ర‌గ్స్ కేసు విచార‌ణను కూడా అట‌కెక్కింది. సీనియ‌ర్ ఐపీఎస్ అకున్ స‌బ‌ర్వాల్(IPS Akun Sabharwal) నేతృత్వంలోని ద‌ర్యాప్తు బృందం.. సినీ ప్ర‌ముఖుల‌ను విచార‌ణ‌కు పిలిచి నాలుగు రోజులు తెగ హ‌డావుడి చేసింది. ఆ త‌ర్వాత ఎవ‌రికి ఏం లాభం జ‌రిగిందో కానీ విచార‌ణ ఆగిపోయింది.

    Phone Tapping Case | వారంతా ఒక్క‌టే..

    ప్ర‌భుత్వాలు మారిన తర్వాత విచార‌ణ‌లు చేప‌ట్ట‌డం, ఆ త‌ర్వాత ప‌క్క‌న ప‌డేయడం రాష్ట్రంలో ఆన‌వాయితీగా వ‌స్తోంది. రాష్ట్రాన్ని కుదిపేసే కీల‌క‌మైన అంశాలు కూడా మ‌రుగున ప‌డేయ‌డం కొన‌సాగుతూ వ‌స్తోంది. రాజ‌కీయంగా తీవ్రంగా విభేదించుకునే నేత‌లు తెర చాటున చేతులు క‌ల‌ప‌డం, ఏదో విధంగా సెటిల్‌మెంట్లు చేసుకుంటుండ‌డంతో విచార‌ణ‌లు ముందుకు సాగ‌డం లేదు. సాగినా దోషులు తేల‌డం లేదు. గ‌తంలో ఇందిర‌మ్మ ఇండ్ల‌పై కేసీఆర్ ప్ర‌భుత్వం(KCR Government) చేప‌ట్టిన విచారణ కొలిక్కి వ‌చ్చే ద‌శ‌లోనే నిలిచి పోయింది. ప్ర‌త్యర్థి పార్టీలోని కీల‌క నేత‌ల‌ను లోబ‌ర‌చుకునేందుకు ఈ విచార‌ణ‌ను అప్ప‌ట్లో వాడుకున్నార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అలాగే, న‌యీం ముఠా ఆగ‌డాల‌పై జ‌రిగిన విచార‌ణ‌లో భారీగా వెలుగు చూసిన అక్ర‌మాస్తులు త‌లా కొంత పంచుకుని కేసు మూసేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇలా ప్ర‌తీ విచార‌ణ వెనుక ఏదో విధంగా సెటిల్‌మెంట్ జ‌రుగ‌డం, ఆ త‌ర్వాత దాన్ని ప‌క్క‌న ప‌డేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న విచార‌ణ‌లైనా కొలిక్కి వ‌స్తాయా? దోషులేవ‌రో తేల్చి శిక్షిస్తారా? లేక గ‌తంలో జ‌రిగిన‌ట్లే ఆయా విచార‌ణ‌ల‌ను మ‌రుగున ప‌డేస్తారా? కాల‌మే స‌మాధానం చెబుతుంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...