అక్షరటుడే, హైదరాబాద్: Cm Revanth Habbits : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ యూత్ ఐకాన్ (Telangana youth icon) అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (BJP MP Konda Vishweshwar Reddy) అన్నారు.
ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, సీఎంకు ఉన్న ఏకైక ఫ్యాషన్ ఫుట్‌బాల్ అని ప్రశంసించారు. ముఖ్యమంత్రిపై కొండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే (International Anti-Drug and Illegal Trafficking Day) సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదిక(Hyderabad Shilpakala Vedika)లో గురువారం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (Anti-Narcotics Bureau) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సినీ హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Cm Revanth Habbits : ఫుట్‌బాల్ మాత్రమే ఫ్యాషన్
సీఎం రేవంత్ ఐకానిక్ అని, ఆయనకు తాగుడు, సిగరెట్, డ్రగ్స్ వంటి అలవాట్లు ఏవీ లేవని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయనకున్న ఏకైక ఫ్యాషన్ ఫుట్‌బాల్ మాత్రమేనని చెప్పారు. ‘ఇక్కడెంతో మంది ఐకాన్స్ ఉన్నారు. సే నో టు డ్రగ్స్.. బట్ వన్ మోర్ ఐకాన్.. ఆయన ఇప్పటి వరకు సిగరెట్టే తాగలేదు. డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు. బీర్ తాగరు. విస్కీ తాగరు. ఆయనకున్న కూల్ థింగ్ ఫుట్‌బాల్. ఆయనే వన్మోర్ ఐకాన్ ముఖ్యమంత్రి’ అని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొండా వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిట్ ఎదుట హాజరు కానున్నారు. గతంలో తన ఫోన్ ట్యాప్ చేశారని పలుమార్లు విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విచారణ అధికారులు ఆయన వాంగ్మూలం రికార్డు చేయనున్నారు.