Nizamabad Collector
Nizamabad Collector |రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువులు (fertilizers), విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. డిచ్​పల్లిలోని (Dichpally) ఎరువులు, విత్తన విక్రయ కేంద్రమైన గ్రోమోర్ సెంటర్​ను (Gromore Center) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్, విత్తన బస్తాలపై లాట్ నెంబర్, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించారు. ఎరువులు, విత్తన అమ్మకాలకు తగిన అనుమతులు పొందిన పత్రాలను తనిఖీ చేశారు.

జిల్లావ్యాప్తంగా ఎక్కడ కొరత లేకుండా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఎరువులు, విత్తన కేంద్రాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి, తహశీల్దార్ సతీష్ రెడ్డి, మండల వ్యవసాయాధికారిణి సుధా మాధురి తదితరులున్నారు.