అక్షరటుడే, వెబ్డెస్క్: ఇరాన్ (Iran)లో పెను ప్రమాదం సంభవించింది. తీరప్రాంత నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. దీంతో పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించడంతో 406 మంది వరకు గాయపడ్డారని నేషనల్ ఎమర్జెన్సీ ఆర్గనైజేషన్ ప్రతినిధి తెలిపినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది.
ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా, పోర్టులోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించినట్లు భావిస్తున్నట్లు చెప్పారు.
పేలుడు అనంతరం దట్టమైన పొగలు వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పేలుడు ధాటికి ఓ భవనం కూలిపోయినట్లు ఇరాన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
పేలుడు సంభవించిన రజేయీ ఓడరేవులో ప్రధానంగా కంటెయినర్ల కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగుతుంటాయి. ఏటా 80 మిలియన్ టన్నుల సరకు ఎగుమతి, దిగుమతి అవుతుంటుంది. స్థానికంగా చమురు ట్యాంకులు, పెట్రో కెమికల్ సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి.