అక్షరటుడే, వెబ్డెస్క్: Trending Dialogue | పుష్పా-2 సినిమాలోని డైలగ్ ‘రప్పా రప్పా’ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics) ఈ డైలగ్ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ఈ పదం తొలుత వైరల్ అయింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోనే. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు వెళ్లారు . ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీలు రాష్ట్రంలో దుమారం రేపాయి. పుష్పా-2 సినిమాలోని (Pushpa-2 Movie) ఫేమస్ డైలాగ్ ‘రప్పా రప్పా నరుకుడే. వచ్చేది జగన్ 2.0’ అని ముద్రించిన ఫ్లెక్సీలతో జగన్ ఫ్యాన్స్ హల్ చల్ చేశారు. దీనిపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, జగన్ తన అనుచరులకు మద్దతుగా మాట్లాడడం మరింత వివాదాస్పదమైంది.
ఇక, ఈ ‘రప్పా రప్పా’ డైలాగ్ (Rappa Rappa dialogue) ఏపీ నుంచి తెలంగాణకు పాకింది. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పాల్గొన్న ధర్నా కార్యక్రమంలోనూ ‘రప్పా రప్పా’ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ‘రప్పా రప్పా వచ్చేది బీఆర్ఎస్ 3.0 (BRS 3.0) ప్రభుత్వమే’ అన్న పోస్టర్లతో గులాబీ శ్రేణులు హల్ చల్ చేశాయి. అటు నల్లగొండలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) కార్యక్రమంలోనూ ఇలాంటి ఫ్లెక్సీలే కనిపించాయి. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ డైలాగ్ ను తాజాగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి (Nizamabad MP Arvind Dharmapuri) కూడా వినియోగించడంతో చర్చనీయాంశమైంది. నిజామాబాద్ లో విలేకరులతో మాట్లాడిన అర్వింద్.. పదేళ్లలో అవినీతికి పాల్పడిన కల్వకుంట్ల కుటుంబ సభ్యులను ‘గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా’ జైలులో పడేయాలని వ్యాఖ్యానించారు. అర్వింద్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఈ డైలాగ్ ను వాడడంతో ప్రస్తుతం ‘రప్పా రప్పా’ హల్ చల్ చేస్తోంది.