అక్షరటుడే, వెబ్‌డెస్క్: Godavari River | గోదావరి జలాల (Godavari Water) వినియోగం విషయంలో తలెత్తిన వివాదాలపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) దృష్టి సారించింది. పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న అంశాన్ని ఎలా పరిష్కరించాలనే అంశంపై కసరత్తు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla project)పై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తడం, దీనిపై తెలంగాణ కేంద్ర జలశాఖకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోదావరి నదీ జలాల విషయంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు కొత్త ట్రిబ్యునల్ (Tribunal) వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉన్న ఈ వివాదాన్ని ట్రిబ్యునల్‌తోనే పరిష్కరించవచ్చని కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Godavari River | ఏపీ అక్రమ ప్రాజెక్టులు
ఇప్పటికే కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గోదావరి జలాలపై కన్నేసింది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం పేరిట బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు వేస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (PFR)ను కేంద్రానికి పంపించింది. అయితే మిగులు జలాల ఆధారంగానే దీన్ని నిర్మిస్తున్నట్లు ఏపీ చెబుతున్నా.. అది తెలంగాణ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ కొడుతుంది. ఈ నేపథ్యంలోనే బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ నేతలంతా (Telangana Leaders) తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం ఇటీవల కేంద్ర జల మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా దీనిపై పాటిల్‌కు వివరించి, అనుమతులు ఇవ్వొద్దని కోరారు.
Godavari River | ట్రిబ్యునల్ ఏర్పాటుపై చర్చ
తెలంగాణ ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర జలమంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ అంశంపై దృష్టి సారించారు. సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులతో చర్చించారు. మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో గోదావరీ నదీ పరివాహక ప్రాంతం ఉంది. గోదావరి మిగులు, వరద జలాల ఆధారంగా కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధిత రాష్ట్రాలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల మధ్య జలాల వినియోగంపై వివాదాలు వస్తున్నాయి. గోదావరి మిగులు, వరద జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌లకు ప్రతిపాదనలు చేసింది.
మరోవైపు గోదావరి మిగులు జలాల పేరిట ఛత్తీస్‌గఢ్ కూడా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఆయా రాష్ట్రాల మధ్య వివాదాలు, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం, ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున వస్తుండడంతో కేంద్రం దీనిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసేలా వివాదాన్ని ఎలా పరిష్కరించాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని కేంద్ర జల మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
గతంలో ఇలాగే జల వివాదాలు తలెత్తిన సమయంలో కేంద్ర ప్రభుత్వం బచావత్ ట్రైబ్యునల్ (Bachawat Tribunal)ను ఏర్పాటు చేసింది. 1980లో అవార్డ్ ప్రకటించిన అనంతరం గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ మనుగడలో లేకుండా పోయింది. కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి వివాదాలు తలెత్తుతుండటంతో బ్రిజేష్ కుమార్ (Brijesh Kumar) నేతృత్వంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఆ ట్రైబ్యునల్ కూడా వివాదాలు లేకుండా రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసింది. ఇప్పుడు మళ్లీ గోదావరి జలాల విషయంలో వివాదలు తలెత్తడంతో కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది.
కృష్ణా నదీ జలాల (Krishna Water) వినియోగానికి కూడా గతంలోనే బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్ ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.