అక్షరటుడే, తాడ్వాయి: Thadwai | పాఠశాలకు లేటుగా వచ్చారని విద్యార్థులతో పాఠశాల సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. మండుటెండలో విద్యార్థులను వారి తల్లిదండ్రులతో సహా గంటల తరబడి ఎండలో నిలబెట్టారు. ఈ ఘటన తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.
విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో (Gurukul School) ఈనెల 15న విద్యార్థులను తీసుకుని రావాలని వారి తల్లిదండ్రులకు సూచించారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను ఐదురోజులు లేటుగా శుక్రవారం పాఠశాలకు తీసుకెళ్లారు. దీంతో లేటుగా వచ్చారని ఆరోపిస్తూ గురుకుల పాఠశాల సిబ్బంది కనీసం గేటు కూడా తీయలేదు. దీంతో మండుటెండలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిలబడాల్సి వచ్చింది. కనీసం చిన్నారులకు నీళ్లు కూడా ఇవ్వకపోవడంతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Thadwai | ఉపాధ్యాయులు బయటకు రాకుండా తాళాలు..
ఎండలతో తమతోపాటు విద్యార్థులును సైతం ఎండలో నిలబెట్టడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది బయటకు రాకుండా మెయిన్ గేట్‌కు తాళాలు వేశారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గురుకుల పాఠశాలకు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. ఎట్టకేలకు విద్యార్థులను స్కూల్ లోపలికి అనుమతించారు.