Flyover
Flyover | ఓ వైపు ఫ్లైఓవర్​ పనులు.. దానికి అడ్డుగా మరోవైపు G+2 భవన నిర్మాణం.. రూ.75 కోట్ల ప్రజాధనం వృథా

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Flyover : రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులే గుత్తేదారులుగా మారుతున్నారు. అభివృద్ధి పేరిట అడ్డగోలుగా పనులు మంజూరు చేయించుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. మంజూరు చేయించుకునే పనుల సాధ్యాసాధ్యాలను పట్టించుకోవడం లేదు. కేవలం ప్రజాధనం స్వాహా చేయడమే తన ప్రథమ కర్తవ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి వంతపాడుతున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు కమిషన్ల రూపంలో తెగ జేబులు నింపేసుకుంటున్నారు.

ఇలానే అర్థంపర్థం లేకుండా.. ఒక ప్రణాళిక వేసుకోకుండా.. అభివృద్ధి పేరిట ఫ్లైఓవర్​ నిర్మాణం చేపట్టి అబాసు పాలయ్యారు ఉత్తర్​ప్రదేశ్(Uttar Pradesh)​ పాలకులు, అధికారులు. భూసేకరణ చేపట్టకుండానే పనులు చేపట్టారు. స్థానికులు అడ్డుకోవడంతో అర్ధంతరంగా నిలిపివేసి నవ్వుల పాలయ్యారు.

లక్నో Lucknow నగరాభివృద్ధిలో భాగంగా ప్రకటించిన కేసరి ఖేడా ఫ్లైఓవర్ (Kesari Kheda flyover) పనులు అధికారుల అనాలోచిత నిర్ణ‌యాల‌ వల్ల అర్ధంతరంగా నిలిచిపోయాయి. కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో శిలాఫలకం వేసి, అట్ట‌హాసంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు 6 నెలలుగా అసంపూర్తిగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

Flyover : మ‌ధ్య‌లోనే ఆటంకం..

ఫ్లైఓవర్‌కు Fly over అవసరమైన భూమి సేకరణ, మార్గ అనుమతులు పొందకుండానే నిర్మాణాన్ని ప్రారంభించిన అధికారులు, ఇప్పుడు అడ్డుగా నిలిచిన తొమ్మిది ఇళ్లు, షాపులను తొలగించలేక నిస్సహాయతలో ఉన్నారు. వాటిని సేకరించేందుకు ఇచ్చే నష్టపరిహారం చట్టబద్ధంగా ఉండాల్సిన సర్కిల్ రేట్ కన్నా మూడింట ఒక వంతు తక్కువగా ఉండడంతో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేసిన మొత్తం ₹75 కోట్లు.

కానీ, పనులు నిలిచిపోయి, ప్రజలకు నిత్య ప్రయాణంలో తీవ్ర అసౌకర్యం ఎదురవుతోంది. ఇటువంటి ప్రణాళికా లోపాలు దేశ అభివృద్ధిపై ప్రశ్నార్థకంగా నిలుస్తున్నాయి. అయినా కూడా మౌలిక సదుపాయాల పేరిట ప్రకటనలు, ప్రారంభోత్సవాలు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి.

ఇది చూస్తుంటే ఇంజినీరింగ్‌ కంటే ముందు ఫైలు నడవాలి, లేకపోతే మలుపులోనే బ్రేక్ Break పడుతుంది అనే సత్యం మరోసారి స్పష్టమవుతోంది. భవిష్యత్తులోనైనా.. ముందుగా ప్రణాళిక, భూమి సేకరణ పూర్తయ్యాకే పనులు ప్రారంభించాలి. లేకపోతే ఇలాంటివి దేశానికి “మోడరన్ మార్వెల్స్” కాదు.. “మోడరన్ మిస్టేక్స్” అవుతాయి అని కొంద‌రు నెటిజ‌న్స్ హెచ్చ‌రిస్తున్నారు.

ఇక ప్రస్తుతం నెట్టింట వైర​ల్​ అవుతున్నఫొటోను పరిశీలిస్తే.. ఓ వైపు ఫ్లైఓవర్​ పనులు చేపడుతుండగానే.. దానికి అడ్డుగా మరో వైపు రెండంతస్తుల నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ భవనం కూడా కొత్తగానే ఉంది. నిర్మాణ పనులు అక్కడక్కడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనీసం నిర్మాణ పనులను ముందుగా అడ్డుకున్నా.. సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.