అక్షరటుడే, వెబ్డెస్క్: APCRDA | ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) ఉండవల్లిలోని తన నివాసంలో సీఆర్డీఏ అథారిటీ(CRDA Authority) సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇది 49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కాగా, ప్రభుత్వ సముదాయం పరిధిలో 1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటి కోసం రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ అమరావతి(Amaravati) నగరాభివృద్ధికి కీలకంగా నిలిచే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రూ.1,052 కోట్లు విడుదల చేసింది.
APCRDA | పెరిగిన స్పీడ్..
ఈ నిధులతో రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ(Drainage system), నీటి సరఫరా(water supply), విద్యుత్ లైన్(power line)లు వంటి విభిన్న మౌలిక రంగాల్లో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు అమరావతిలో శాశ్వతంగా నివసించేందుకు అవసరమైన మౌలిక వనరులను అందుబాటులోకి తెస్తాయని అధికారులు తెలిపారు. సీఆర్‌డీఏ(APCRDA) తీసుకున్న ఈ నిర్ణయం అమరావతి అభివృద్ధి పునఃప్రారంభానికి బలమైన సంకేతంగా అభిప్రాయపడుతున్నారు నిపుణులు. సీడ్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారికి అనుసంధానించడానికి రూ.682 కోట్లకు టెండర్లు కూడా పిలవనున్నారు. గ్రీన్ అండ్ బ్లూ సిటీ గురించి అధికారులతో చర్చలు జరిపినట్లు మంత్రి నారాయణ(Minister Narayana) తెలిపారు.
లక్నో సందర్శన గురించి తన అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు. అక్కడ వారు నది బండ్ నిర్మాణం గురించి అధ్యయనం చేశారు. లక్నోలో తాము చూసిన ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ గురించి కూడా నారాయణ ముఖ్యమంత్రికి చెప్పారు. ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను అధ్యయనం చేయడానికి యూపీ అధికారులు అమరావతిని సందర్శిస్తారని మంత్రి వెల్లడించారు. ప్రజా రాజధాని అమరావతిని మూడేళ్లలో పూర్తి చేసేలా టెండర్లు పిలిచే ప్రక్రియను అథారిటీ వేగవంతం చేసింది.