అక్షరటుడే, వెబ్‌డెస్క్: TDP Andhra Pradesh | వైసీపీ ప్రభుత్వం(YSRCP government) పడిపోయి కూటమి సర్కారు కొలువుదీరి రేపటితో ఏడాది అవుతుంది. అయితే ఈ ఏడాది కాలంలో మంచి చెడులు ఏంటనే విషయంపై జనాలు, మీడియా చర్చించడం సహజం. అయితే కూటమి ప్రభుత్వానికి కాస్త అనుకూలంగా ఉండే ఆంధ్రజ్యోతి(Andhra Jyothi) నాటి వైసీపీ ఎమ్మెల్యేల దందాలను కొందరు కూటమి ఎమ్మెల్యేలు తలపిస్తున్నారు అంటూ ప్రత్యేక కథనం ప్రచురించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేలు ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అందరి మన్ననలు పొందాలని చంద్రబాబు (Chandra babu naidu) సూచించగా.. కొందరు ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతున్నారంటూ ఆంధ్రజ్యోతి విశ్లేషణాత్మకంగా కథనం ప్రచురించింది.
TDP Andhra Pradesh | ఏంటి ఈ అరాచకాలు…
అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి విజయం సాధించారు. అయితే ఆయన నియోజకవర్గం మొత్తం సోదరుల గుప్పెట్లో ఉండడంతో నియోజకవర్గ పనులను టీడీపీ శ్రేణులకు కాకుండా కమీషన్స్ ఇచ్చే వారికి కట్టబెడుతున్నారట. ఇక విజయవాడ నగరంలోని ఓ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు వేటినీ వదలకుండా నెలవారీ వసూళ్లు చేస్తున్నారు. కేబుల్ ఆపరేటర్లను(Cable Operators) భయపెట్టి చాలా కనెక్షన్లను కూడా లాగేసుకున్నాడట. ఇక ఎన్టీఆర్ NTR జిల్లాలో రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే మహిళలపై అనుచితంగా ప్రవర్తించడం, తనను కలవడానికి వచ్చిన ప్రజలని అసహ్యించుకోవడం చేస్తున్నాడట.
ఇక శ్రీకాకుళం ఎమ్మెల్యే అవినీతిని పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నాయి. ఇసుక దోపిడీ, కాంట్రాక్ట్ పనుల్లో కమీషన్స్, ట్రావెల్ బస్సుల నుంచి కూడా ముడుపులు తీసుకోవడం చేస్తున్నాడట. ఇక నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న ఓ నాయకుడు పోర్టు కాంట్రాక్టర్లను(Port Contractors) బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా పోర్టు పనుల్లో సబ్ కాంట్రాక్టు పనులు తాను చెప్పిన వారికే ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడట. పల్నాడు Palnadu జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఓ సీనియర్ నేత అయితే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిపై కూడా టీడీపీ శ్రేణులన్నీ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి.
కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పెత్తనమంతా ఆయన కుమారుడు, అల్లుడిదేనట. ఆయనపై వ్యతిరేకత ఉంది. కర్నూలు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే అయితే తనకు ఎన్నికల్లో సాయం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి నియోజకవర్గాన్ని రాసిచ్చేశారు. వైసీపీ రౌడీ గ్యాంగ్‌లను టీడీపీలో చేర్చుకున్నారట. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ లీడర్లనూ పట్టించుకోవడం లేదట. ఇక నంద్యాల (Nandiyala) జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆమె భర్తదే హవా. మట్టి అక్రమ రవాణా, ఇసుక దోపిడీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేపై కూడా తీవ్ర వ్యతిరేఖత ఉంది. మద్యం షాపులు, మెడికల్ ఏజెన్సీలు, పీడీఎస్ బియ్యం దేనినీ వదలరట. నంద్యాల జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తన ఇద్దరు కొడుకులకు కట్టబెట్టేశారు.
నంద్యాల జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తన చిన్నాన్న చేతికి అప్పగించారు. ఇటీవల ఓ వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేస్తే.. అతడిని రిమాండ్‌కు పంపకుండా ఈయన సాయం చేశారనే టాక్ ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే భార్య పంచాయితీలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈయన పీఏలు అందినకాడికి దండుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా(Anakapalle District)కు చెందిన మహిళా ఎమ్మెల్యే భూముల సెటిల్‌మెంట్లు, గ్రావెల్, మట్టి దందా, మద్యం వ్యాపారం బాగా నడిపిస్తున్నాడట. శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ నియోజకవర్గం నుంచి కూటమి పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండడట. ఎక్కువగా అమరావతి, ఢిల్లీలో గడుపుతుంటారు. ఈయన పీఏనే ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంటారు. విజయవాడ (Vijaywada) చెంతనే ఉన్న ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే, కృష్ణా జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నియోజకవర్గం నుంచి ఎంపికైన ఎమ్మెల్యే, విజయవాడ చెంతనే కృష్ణా జిల్లాకు చెందిన ఇంకో నియోజకవర్గ ఎమ్మెల్యే , పల్నాడు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఏడాదిలోనే వారిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అధిష్టానం కూడా సీరియస్‌గా ఉంది. ఈ శీరిక్ష ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ఉటంకిస్తూ చెప్పడం జరిగింది.