అక్షరటుడే, వెబ్‌డెస్క్: Air Conditioners | దేశంలో ఏసీ(AC)ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఎండా కాలం వచ్చిందంటే కార్యాలయాలు, ఇళ్లలో విపరీతంగా ఏసీలు వినియోగిస్తారు. అయితే ఏసీల వినియోగంతో విద్యుత్ అధికంగా ఖర్చు అవుతోంది. అంతేగాకుండా కర్బన ఉద్గారాలు విడుదలై కాలుష్యానికి కారణం అవుతాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఏసీల వినియోగం విషయంలో కొత్త రూల్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏసీ టెంపరేచర్ 20 నుంచి 28 డిగ్రీల మధ్య ఉండేలా సెట్టింగ్స్ తీసుకొస్తామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Union Minister Manohar Lal Khattar) తెలిపారు. వినియోగదారులు 20 డిగ్రీల కంటే తక్కువ 28 కంటే ఎక్కువ టెంపరేచర్ పెట్టుకోకుండా సెట్టింగ్స్ మార్చాలని కంపెనీలకు చెబుతామన్నారు. దీంతో విద్యుత్ ఆదా(Electricity Saving) అవడమే కాకుండా కర్బన ఉద్గారాలు తగ్గుతాయని చెప్పారు.
Air Conditioners | ఒక్కో డిగ్రీకి ఆరు శాతం విద్యుత్ ఆదా
ప్రస్తుతం కొన్ని ఏసీల్లో 16 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు టెంపరేచర్ సెట్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో చాలా మంది నియంత్రణ లేకుండా ఇష్టారీతిన ఏసీలను వినియోగిస్తున్నారు. చాలా కార్యాలయాల్లో 20 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ పెట్టుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో విద్యుత్ వినియోగం(Electricity consumption) విపరీతంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఏసీ కంపెనీలతో మాట్లాడి 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండేలా తయారు చేయాలని ఆదేశిస్తామన్నారు. ఈ మేరకు కొత్త రూల్ తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. ఒక్కో డిగ్రీ టెంపరేచర్ పెంచిన కొద్ది ఆరు శాతం విద్యుత్ ఆదా అవుతుందని ఆయన వెల్లడించారు.