అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sakshi Office | ఆంధ్రప్రదేశ్(ap)లో సాక్షి కార్యాలయాల(Sakshi Office)పై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల సాక్షి టీవీ (Sakshi TV)లో ప్రసారం అయిన ఓ డిబేట్లో అమరావతి (Amaravati) మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు (KSR)ను అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది.
ఆ వ్యాఖ్యలపై జగన్ (YS Jagan), సాక్షి మీడియా అధినేత భారతి (YS Bharati) క్షమాపణలు చెప్పాలని టీడీపీ నాయకులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా సాక్షి కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల దాడులకు కూడా పాల్పడ్డారు. తాజాగా మంగళవారం ఏలూరులోని సాక్షి కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫా సెట్లు కాలిపోయాయి. కార్యాలయం ఎదుట ఉన్న కారును సైతం ధ్వంసం చేశారు.
సాక్షి కార్యాలయానికి టీడీపీ(TDP) నేతలే నిప్పు పెట్టారని వైసీపీ (YCP) ఆరోపిస్తోంది. కాగా.. దీనిని టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, తాము ర్యాలీగా వెళ్తుంటే నిందలు మోపుతున్నారని వారు పేర్కొన్నారు.