అక్షరటుడే, వెబ్డెస్క్ : India Population | భారత్ జనాభాలో చైనాను (Cina) దాటేసింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ (India) అవతరించింది. దేశంలో జనాభా 1.46 బిలియన్లకు చేరినట్లు ఐక్యరాజ్య సమితి జనాభా నివేదిక తెలిపింది. గత కొంతకాలంగా చైనాలో జనాభా వృద్ధి రేటు తగ్గింది. దీంతో భారత్ జనాభాలో ఆ దేశాన్ని అధిగమించింది.
India Population | తగ్గిన సంతానోత్పత్తి రేటు
భారత్ ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశంగా అవతరించినా.. సంతానోత్పత్తి రేటు మాత్రం తగ్గడం గమనార్హం. ప్రస్తుతం భారత్లో సంతానోత్పత్తి రేటు 1.9 గా ఉందని UNFPA 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ (State of World Population) నివేదిక తెలిపింది. జనాభా రిప్లేస్మెంట్ లెవల్ (population replacement level) సంతానోత్పత్తి రేటు 2.1గా ఉండాలి. అంతకు మించి పడిపోవడంతో భవిష్యత్లో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
India Population | అప్పుడు గరిష్ట స్థాయికి..
భారత దేశ జనాభా (India population) 2060 గరిష్ట స్థాయికి చేరుకుంటుందని నివేదిక తెలిపింది. అప్పుడు 1.7 బిలియన్లకు జనాభా చేరి తర్వాత తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. ప్రస్తుతం యువత పిల్లలు కనడంపై ఆసక్తి చూపడం లేదు. ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన నేటి తరం ఎక్కువ మంది పిల్లలు వద్దు అనుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది దంపతులు ఒకరు, ఇద్దరు పిల్లలను మాత్రమే కంటున్నారు. భవిష్యత్లో ఇది మరింత తగ్గనుంది. దీంతో జనాభా (population) తగ్గుతుంది.
India Population | పెరగనున్న వృద్ధుల జనాభా
ప్రస్తుతం దేశంలో పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలో 0-14 సంవత్సరాల వారు 24 శాతం, 10-19 ఏళ్లవారు 17 శాతం, 10-24 ఏళ్ల వారు 26 శాతం ఉన్నారు. దేశంలోని 68 శాతం జనాభా (population) పని చేసే వయస్సు (15-64) కలిగి ఉంది. ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు తగ్గింది. రానున్న రోజుల్లో ఇది మరింత పడిపోయే అవకాశం ఉంది. దీంతో మరి కొన్నేళ్లలో దేశంలో వృద్ధుల జనాభా పెరగనుంది. ప్రస్తుతం చైనా ఇదే సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.