అక్షరటుడే, బోధన్: Kiledi new fraud : అనాథనని నమ్మించింది.. ఎవరూ లేరంది.. తన వద్ద చాలా డబ్బు ఉందని చెప్పుకొంది. మీ బ్యాంకు అకౌంట్లోకి రూ. 10 లక్షలు వేస్తానని ఆశ చూపింది. కానీ, వారినే వంచించి ఉన్నదంతా దోచుకుపోయింది. అమాయకురాలని నమ్మిన ఆ దంపతులు నిలువు దోపిడీకి గురై, చివరికి పోలీసులను ఆశ్రయించారు.
నిజామాబాద్ జిల్లా(Nizamabad district) బోధన్ పట్టణ ప్రాంతంలో సైబర్ మోసానికి పాల్పడిన యువతిని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్ హెచ్ వో వెంకటనారాయణ(SHO Venkatanarayana) తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మే 30న పబ్బులేటి సోనీ ప్రత్యూష అనే యువతి తాను అనాథ అని ఓ బ్యాంక్ కు వచ్చిన నాగన్ పల్లికి చెందిన శ్రీనివాస్ దంపతులని నమ్మించింది. వారి అకౌంటుకి రూ.10 లక్షలు పంపుతానని, ఆ మొత్తాన్ని డ్రా చేసి ఇవ్వమని కోరింది. అందుకు వారు ఒప్పుకొని రాత్రి యువతిని శ్రీనివాస్ ఇంటికి తీసుకెళ్లారు.
రాత్రి సమయంలో యువతి అకౌంటు నుంచి వారి ఖాతాలోకి డబ్బులు వేస్తానని, ఇందుకోసం శ్రీనివాస్ భార్య అకౌంటు(account), ఏటీఎం కార్డ్(ATM card), పిన్ నం(PIN number), సిమ్ కార్డ్(SIM card) ఇవ్వమని అడగడంతో.. వారు ఆ వివరాలు సోనీ కి ఇచ్చారు. అనంతరం అకౌంటు నుంచి యువతి రూ. 7,49,500 ట్రాన్స్ ఫర్ చేసుకొని, ఐరేండ్ల నరేష్ సహాయంతో బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసుకుని పారిపోయింది.
మోసపోయిన విషయాన్ని గుర్తించిన బాధిత దంపతులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితురాలు సోనీ ప్రత్యూషను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి రూ. 3,80,000 నగదు, రెండు ఐ ఫోన్లు, ఒక ఒప్పో ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్ కు తరలించారు.