అక్షరటుడే, ఇందూరు : Private Schools | వేసవి సెలవులు ముగిశాయి. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. అప్పుడే ప్రైవేట్ బడులు (private schools) దందాకు తెరలేపాయి. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో సామగ్రి విక్రయిస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు ఖాళీ చేస్తున్నాయి. విద్యార్థులకు అవసరం లేకున్నా.. బలవంతంగా అంటగడుతున్నాయి. అయినా విద్యా శాఖాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
జూన్ నెల వచ్చిందంటే ప్రైవేట్ బడులు (private schools) అడ్మిషన్లు, డొనేషన్ల పేరిట వసూళ్లకు పాల్పడుతాయి. ఒకవైపు నిబంధనలకు విరుద్ధంగా డొనేషన్లు(donations) తీసుకుంటూ.. మరోవైపు పాఠశాలల్లో రకరకాల సామగ్రి ఎక్కువ ధరకు విక్రయిస్తూ తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. దీంతో పాఠశాలల రీ ఓపెనింగ్ అనగానే ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Private Schools | డోనేషన్ల పేరిట..
జిల్లాలో ప్రైమరీ, హైస్కూల్(primary and high schools) కలిపి దాదాపు 500 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉంటాయి. గురువారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే అడ్మిషన్ల పేరిట ప్రైవేట్ పాఠశాలలు (private schools) తల్లిదండ్రుల నుంచి పిండేస్తున్నాయి. ఎలాంటి వసతులు లేకున్నా.. గారడి మాటలు చెప్పి పిల్లల నుంచి అడ్మిషన్లు చేసుకున్నాయి. అయినా అనుమతి లేని బడుల విషయంలో విద్యాశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.
దీనికి తోడు బుక్స్(book), యూనిఫామ్స్, ఇతర సామగ్రి తమవద్దే కొనుగోలు చేయాలంటూ పలు పాఠశాలలు.. విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్కు మెసేజ్లు పంపుతున్నాయి. బడుల ప్రారంభానికి ముందే స్టాళ్లను తెరిచి విక్రయిస్తున్నాయి. కొన్ని పాఠశాలలు నేరుగా విక్రయిస్తే.. మరికొన్ని పాఠశాలలో బయట దుకాణాలతో అనుసంధానం చేసుకొని వసూళ్ల దందాకు పాల్పడుతున్నాయి. బయటి మార్కెట్లో తక్కువ ధరకు దొరికే ఆయా సామగ్రిని రెండింతలు ఎక్కువ ధరకు విక్రయిస్తూ తల్లిదండ్రుల (parents) జేబులకు చిల్లు పెడుతున్నాయి.
Private Schools | నిబంధనలకు విరుద్ధంగా..
విద్యాశాఖ(education department) నిబంధనల ప్రకారం పాఠశాలలో డొనేషన్లు తీసుకోవడం, సామగ్రిని విక్రయించడం చేయొద్దు. కానీ ప్రస్తుతం ప్రతి పాఠశాలలో నోట్ బుక్లు, బూట్లు, బెల్ట్, స్పోర్ట్స్ డ్రెస్సులు, స్కూల్ డ్రెస్సులు, ప్రీప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు పుస్తకాలు విక్రయిస్తున్నాయి. తరగతిని బట్టి ధరను నిర్ణయిస్తూ అన్ని కలిపి ఒకే ప్యాకేజీలో(package) అందజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం విద్యార్థి సంఘాలు వీటిపై నిరసనలు వ్యక్తం చేస్తున్నా.. ఫలితం లేకుండా పోయింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేసి నోటీసులు అందజేస్తున్న అధికారులు.. ఆ తర్వాత చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.