అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ను తక్కువ చేసి చూపించేందుకు, తామేదో సాధించామని చెప్పుకొనేందుకు పాకిస్తాన్ (Pakistan) చేసిన కుట్రలు భగ్నమయ్యాయి. ఇండియా విమానాల(Indian aircraft)ను కూల్చేశామని పాక్ చెప్పిన మాటలన్నీ కట్టుకథలని తేలిపోయాయి.
పంజాబ్(Punjab)లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్(Adampur airbase)లో సుఖోయ్ యుద్ధ విమానాన్ని (Sukhoi fighter jet), గుజరాత్(Gujarat)లోని భుజ్ ఎయిర్‌ఫీల్డ్(Bhuj airfield)లో ఉన్న S-400 సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి యూనిట్‌ను ధ్వంసం చేశామని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటోంది. కానీ, ఇదంతా తప్పుడు ప్రచారమని తాజాగా తేలిపోయింది. పాత ఫొటోలను వైరల్ చేస్తూ తామేదో చేశామని చెప్పుకొంటున్నదంతా ఉత్తిదేనని స్పష్టమైంది.
Operation Sindoor : ప్రతీకార దాడులతో బెంబేలు..
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితో భారతావని ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ క్రమంలోనే భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకెళ్లి మరీ తొమ్మిది ప్రాంతాలపై మన వైమానిక దళం బాంబులతో విరుచుకుపడింది.
లష్కరే తోయిబా (Lashkar-e-Taiba), జేషే మహమ్మద్ (Jaish-e-Mohammad) వంటి ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ పూర్తిగా నేలమట్టం చేసింది. దీంతో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు యత్నించగా, ఇండియా తిప్పికొట్టింది. అంతేకాదు, పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి ఆ దేశ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత మిసైళ్ల దాడితో వణికిపోయిన దాయాది.. కాల్పుల విరమణ అంటూ శరణు వేడింది.
Operation Sindoor : తప్పుడు ప్రచారం..
భారత్ దాడులతో బెంబేలెత్తిన పాకిస్తాన్.. తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించింది. ఆపరేషన్ సిందూర్ తమపై పెద్దగా ప్రభావం చూపలేదని తన ప్రజలతో పాటు ప్రపంచ దేశాలను నమ్మించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా భారత్‌లోని కీలక వైమానిక స్థావరాలను దెబ్బ తీశామని చెప్పుకొంటూ పాత ఫొటోలు వైరల్ చేస్తోంది.
పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో సుఖోయ్ యుద్ధ విమానాన్ని, గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న S-400 సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి యూనిట్‌ను ధ్వంసం చేశామని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటోంది. అయితే, ఇవన్నీ కట్టుకథలేనని అప్పట్లోనే భారత్ కొట్టిపడేసింది.
తాజాగా ప్రముఖ ఇమేజరీ విశ్లేషకుడు డామియన్ సైమన్ బయటపెట్టిన శాటిలైట్ చిత్రాలు.. పాకిస్తాన్‌వి ఉత్తర ప్రగల్బేనని నిరూపిస్తున్నాయి. చైనా ఉపగ్రహ సంస్థ అందించిన చిత్రాలతో సహా తారుమారు చేసిన ఫొటోలను ఉపయోగించి పాకిస్తాన్ ఎలా తప్పుడు కథనాలు ప్రచారం చేసిందో ఆయన బహిర్గతం చేశారు. ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో సుఖోయ్-30MKI(Sukhoi-30MKI)ని దెబ్బతీసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఈ వాదనకు మద్దతుగా ఉపయోగించిన ఉపగ్రహ చిత్రం కాలిన గుర్తుకు దగ్గరగా ఉన్న జెట్‌ను చూపించింది.
అయితే, ఈ చిత్రం ఆపరేషన్‌కు ముందు తీసిన చిత్రమని రివ్యూలో తేలింది. పైగా అది పాకిస్తాన్ చెబుతున్నట్లు సుఖోయ్ కాదని, MiG-29 విమానమని తేలింది. భుజ్ వద్ద భారతీయ S-400 రాడార్ వ్యవస్థను నాశనం చేసినట్లు పాక్ ప్రచారం చేస్తున్న మరో ఫొటో కూడా పాతదేనని వెల్లడైంది. ఈ చిత్రం సైనిక స్థావరం ఆప్రాన్‌పై నల్లటి మచ్చలను చూపించింది.
కానీ, పాక్ చెబుతున్న ఆ మచ్చలు చమురు మరకలు అని తేలింది. ఆదంపూర్‌లోని S-400 వ్యవస్థను ధ్వంసం చేశామని పాక్ విడుదల చేసిన చిత్రం పూర్తిగా మార్ఫింగ్ అని తేలిపోయింది. రన్‌వే చుట్టూ నేల చీకటిగా ఉన్నట్లు కనిపించే నాలియా ఎయిర్‌బేస్ పై దాడి చేశామని పాకిస్తాన్ ఓ ఫొటో విడుదల చేసింది. రివ్యూలో ఆ నష్టం ఓవర్ హెడ్ మేఘపు నీడ అని తేలిపోయింది.