అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Open Challenge | ప్రస్తుతం చాలా మంది యువత సోషల్ మీడియా(Social Media)లో ఫేమస్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రీల్స్, షార్ట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటికి వచ్చే లైక్‌లు, కామెంట్లు చూసి సంబర పడుతున్నారు. అయితే కొందరు ఫేమస్ కావడానికి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. మరికొందరు అసభ్యకర వీడియోలు తీస్తున్నారు. మరికొందరు ఛాలెంజ్‌ల పేరిట వీడియోలు తీస్తున్నారు. తాజాగా ఓపెన్ ఛాలెంజ్ (Open Challenge) పేరిట వైరల్ అవుతున్న వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Open Challenge | ఏంటి ఓపెన్ ఛాలెంజ్..?
గతంలో రకరకాల ఛాలెంజ్‌లు పేరిట యువత వీడియోలు తీసేవారు. ఇటీవల అమెరికాలో ఓ యువతి డస్టింగ్ ఛాలెంజ్ (Dusting Challenge)లో పాల్గొని ప్రాణాలు కోల్పోయింది. ఇళ్లలో వాడే డస్ట్ క్లీనర్ స్ప్రేను పీల్చుతూ వీడియోలు తీయడమే.. డస్టింగ్ ఛాలెంజ్. ఓ యువతి ఇలాగే స్ప్రే పీల్చుకోగా అనారోగ్యానికి గురై చనిపోయింది. తాజాగా ఓపెన్ ఛాలెంజ్ అంటూ కొందరు బైక్‌పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. బైక్‌పై వేగంగా వెళ్తూ.. ట్యాంక్‌లో పెట్రోల్ పోయడమే ఓపెన్ ఛాలెంజ్. ఈ విన్యాసం చేసేటప్పుడు ఏ మాత్రం అదుపు తప్పినా ప్రాణాలు పోవడం ఖాయం. ఎందుకంటే పెట్రోలు ట్యాంక్ ఓపెన్ ఉండడంతో.. కాబట్టి మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది.
Open Challenge | ఇలాంటి పనులు చేయొద్దు
ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సైబర్ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్‌ల బారీన పడకుండా అవగాహన కల్పిస్తుంటారు. అంతేగాకుండా ఎవరైనా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి వీడియోలు పెడితే అలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తుంటారు. తాజాగా ఓపెన్ ఛాలెంజ్‌పై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
ఫేమస్ అవడానికి ఇలాంటి పనులు చేయొద్దని సూచించారు. సోషల్ మీడియా వైరల్ వెర్రి పట్టి దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదకర వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.