అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pithapuram Varma : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం (Pithapuram constituency) తరచూ హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా మరోమారు వార్తల్లో నిలిచింది. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ హయాంలో ఇసుక దందాకు పాల్పడిన వారే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని వర్మ ఆరోపించారు. వారికి ఎవరి అండదండలు ఉన్నాయో తెలియడం లేదని ఆయన అన్నారు. ఈయన చేసిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి.
పిఠాపురం నియోజకవర్గంలోని మల్లివారి తోటలో ఇసుక అక్రమ తవ్వకాలను వర్మ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో ఇసుక మాఫియాతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మణక్కపేటలో అక్రమ రవాణాకు శంకుస్థాపన చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అనుమతులు లేకుండా ఎలా ఇసుక తవ్వకాలు చేస్తున్నారో తెలియడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ సర్కారు హయాంలో ఇసుక తవ్వకాలపై టెంట్లు వేసి పోరాటం చేశామని వర్మ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా వారే ఇసుక దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీరికి ఎవరు సాయం చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. జనసేన పేరు ప్రస్తావించకుండా వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ (Telugu Desam Party) పాత్ర లేదని వర్మ స్పష్టం చేశారు. ఈ అక్రమ దందాలో తెలుగుదేశం నాయకులు ఉంటే.. వారిని జైల్లో పెట్టాలని అన్నారు. కూటమి పార్టీల విషయాన్ని ప్రస్తావిస్తూ.. పిఠాపురంలో ఇసుక దందా విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. ఇసుక మాఫియాతో పోలీసులు చేతులు కలిపారని వర్మ ఆరోపించారు.
పిఠాపురంలో ఇసుక అక్రమ తవ్వకాల పేరిట పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గత ఇరవై రోజులుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లొచ్చు కదా..? అని మీడియా ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ తప్పకుండా చర్యలకు ఆదేశిస్తారని వర్మ చెప్పుకొచ్చారు.
కాగా, వైసీపీ హయాంలో ఇసుక దందాకు పాల్పడుతున్న వారే.. ఇప్పుడూ కొనసాగిస్తున్నారని.. ఇందులో టీడీపీ ప్రమేయం లేదని వర్మ చెప్పడం ద్వారా కొత్త వివాదానికి తెరలేపారు. దీనిపై మరి జనసేన ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.