అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad | మృత్యువు ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో ఎవరికీ తెలియదు. రాత్రి నిద్రపోయిన వ్యక్తి, మరుసటి రోజు ఉదయం లేస్తారో లేదో కూడా నమ్మకం లేని దుస్థతి. కొత్తగా పెళ్లైన ఓ జంట రైలులో హనుమూన్ కు వెళ్తుండగా.. రైలు(Train) ఆలస్యం వరుడి ప్రాణాలు తీసింది. ఫలితంగా గమ్యం చేరకుండానే వారి ప్రయాణం విషాదాంతంగా మారింది. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station)లో చోటుచేసుకుంది.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల(GRP police) కథనం ప్రకారం, తెలంగాణలోని వరంగల్ కు చెందిన రమేశ్ కుమారుడు ఉరగొండ సాయి(28) స్థానికంగా గిఫ్ట్ ఆర్టికల్స్ తయారీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతడికి 3 నెలల క్రితం పెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో హనీమూన్ ప్లాన్ చేసుకొని గోవా(Goa) వెళ్లాలని కొత్త జంట నిర్ణయించుకుంది. ఈ మేరకు రైలు టికెట్లు రిజర్వేషన్(Tickets reservation) చేసుకున్నారు.
భార్య, బావమరిది, నలుగురు స్నేహితులతో కలిసి గోవా వెళ్లడానికి శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వీరు వెళ్లాల్సిన రైలు రైల్వేస్టేషన్లో తొమ్మిదో నంబరు ప్లాట్‌ఫాంపై ఆగి ఉంది. అందరూ వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్(Vasco da Gama Express) ఎక్కి తమ సీట్లలో కూర్చున్నారు. రైలు బయలుదేరడానికి ఆలస్యం అయింది. దీంతో ప్లాట్‌ఫాంపై ఉన్న స్టాల్లో వాటర్ బాటిల్ కొనేందుకు సాయి కిందికి దిగాడు.
వాటర్ బాటిల్ కొంటుండగా, అంతలోనే రైలు కదిలింది. దీంతో బోగీలో ఉన్న సాయి స్నేహితులు చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. ఆర్పీఎఫ్ పోలీసులు(RPF police) బోగీలోకి చేరుకుని ఏం జరిగిందని ప్రశ్నించారు. వారు జరిగిన విషయం చెప్పడంతో వారిని పోలీసులు ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చారు. అప్పటికే రైలు ఎక్కిన సాయి విషయం తెలుసుకొని మళ్లీ కిందికి దిగి ప్లాట్‌ఫాం మీదకు చేరుకున్నాడు. పోలీసులకు ఫైన్ కడతామని, రైలు వెళ్లిపోతుందని వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాడు. ఇంతలోనే రైలు బయలుదేరింది.
రైలులో సాయి భార్య, బావమరిది, మరో ఇద్దరు స్నేహితులు ఉండిపోయారు. దీంతో సాయి వేగంగా పరిగెత్తి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే కాలు జారి రైలు, ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ ఘటనలో యువకులు రైలు చైన్ లాగి తప్పు చేశారు. నిజమే, అయితే పోలీసులు(Police) మరీ సీన్ చేసి యువకులను కిందికి దింపి వారిని భయపెట్టారనేది బాధితుల ఆరోపణ. తమని వదిలి పెట్టమని, ఫైన్ కడతామని ఎంత ప్రాధేయపడినా వినలేదని వాపోతున్నారు. తమ కళ్లెదుటే స్నేహితుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.