అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shadnagar Police | గంజాయి అమ్మేవారిపై కేసులు పెట్టాల్సిన ఓ ఎక్సైజ్ కానిస్టేబులే గంజాయి కొట్టేశాడు. అంతటితో ఆగకుండా గంజాయి విక్రయించాలని తన బంధువును పురమయించాడు. తీరా కటకటాల పాలయ్యాడు.
ఈ ఘటన రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గులాం సుల్తాన్ అహ్మద్(52) తాండూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ (Tandur Excise Police Station)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గతంలో పట్టుబడిన గంజాయి దహనం చేయడానికి తీసుకెళ్తుండగా.. కానిస్టేబుల్ అహ్మద్ చేతివాటం ప్రదర్శించాడు.
అందులో నుంచి మెల్లిగా కిలోన్నర గంజాయి కొట్టేశాడు. ఆ గంజాయి ప్యాకెట్‌ను తన బంధువు షాద్‌నగర్ (Shadnagar)కు చెందిన మహ్మద్ అంజాద్(32)కు ఇచ్చి విక్రయించాలని సూచించాడు. షాద్‌నగర్‌లోని ఫరూఖ్‌నగర్ ఈద్గా వద్ద అంజాద్ గంజాయి విక్రయించడానికి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా.. తనకు ఎక్సైజ్ కానిస్టేబుల్ సుల్తాన్ గంజాయి ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.