అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US President | జాతీయ భద్రతా ప్రమాదాలుగా పేర్కొంటూ 19 దేశాల పౌరులపై ప్రయాణ నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయా దేశాల వారిని ఆందోళనలోకి నెట్టేసింది. కానీ ఈ దేశాల జాబితాలో పాకిస్తాన్‌కు చోటు దక్కక పోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అమెరికా నిషేధించిన ఉగ్రవాద గ్రూపులకు (terrorist groups) బహిరంగంగా ఆతిథ్యం ఇచ్చే పాకిస్తాన్ పేరు నిషేధిత దేశాల జాబితాలో లేకపోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. అధ్యక్షుడిగా మొదటి పదవీ కాలంలో ట్రంప్ వైఖరి పాకిస్తాన్(Pakistan)పై పూర్తి వ్యతిరేకంగా ఉండగా, ఇప్పుడు ఆయన తన ధోరణిని మార్చుకోవడం, పాక్‌తో అంటకాగుతుండడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
US President | మారిన వైఖరి..
ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ (Pakistan) విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తారని, పాక్‌తో పాటు వివిధ దేశాల పౌరులపై ప్రయాణ ఆంక్షలు విధిస్తారని మార్చిలో వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని రాయిటర్స్ కూడా వెల్లడించింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని (Pakistan terrorism) ప్రోత్సహిస్తున్న తరుణంలో ట్రంప్ తన మొదటి పదవీకాలంలో చాలా కఠినంగా వ్యవహరించారు.
కానీ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్‌తో చెట్టాపట్టాల్ వేసుకునే ధోరణి కనబరుస్తున్నారు. అయితే, ట్రంప్ వైఖరి ఎందుకు మారిందన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాక్‌తో, ట్రంప్ కుటుంబానికి సంబంధం ఉన్న వ్యాపార సంస్థల మధ్య వాణిజ్య, రాజకీయ సంబంధాలు మరింత దగ్గరవుతున్న సమయంలోనే ఈ మార్పు వచ్చిందన్నది స్పష్టంగా తెలుస్తోంది.
US President | వ్యాపారమే ప్రధానమా?
అమెరికా అధ్యక్షుడిగా తన మొదటి పదవీకాలంలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 2018లో పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. “గత 15 సంవత్సరాలుగా అమెరికా (America) మూర్ఖంగా పాకిస్తాన్‌కు 33 బిలియన్ డాలర్లకు పైగా సహాయం చేసింది. కానీ, వారు మన నాయకులను మూర్ఖులుగా భావించి మనకు అబద్ధాలు, మోసం తప్ప మరేమీ ఇవ్వలేదు. మేము ఆఫ్ఘనిస్తాన్‌లో వేటాడే ఉగ్రవాదులకు వారు (పాక్) సురక్షితమైన స్వర్గధామం కల్పిస్తున్నారు, తక్కువ సహాయం మాత్రమే. ఇక లేదు!” అని తన పోస్టులో పేర్కొన్నారు.
ఆ సంవత్సరం ఆగస్టులో, US సైన్యం పాకిస్తాన్‌కు 300 మిలియన్ డాలర్ల సహాయాన్ని రద్దు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌తో (Afghanistan) ఉన్న సరిహద్దు ప్రాంతం నుంచి ఉగ్రవాదులను నిర్మూలించడానికి పాక్ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఒసామా బిన్ లాడెన్‌ను దాచడానికి పాకిస్తాన్ (Pakistan) సహాయం చేసిందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో పాక్‌పై కఠిన చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ 2019లో పాకిస్తాన్‌పై ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ (INA) సెక్షన్ 243(d) కింద వీసా ఆంక్షలు విధించారు..
అయితే, రెండోసారి గద్దెనెక్కాక ట్రంప్ పాకిస్తాన్ విషయంలో సానుకూల వైఖరి అవలంభించడం ప్రారంభించారు. 19 దేశాల పౌరులపై ప్రయాణ నిషేధాన్ని విధించినప్పటికీ, ఉగ్రవాదుల స్వర్గధామమైన పాకిస్తాన్‌ను ఈ జాబితాలో చేర్చలేదు. పాకిస్తాన్‌ను మినహాయించాలనే ట్రంప్ తాజా నిర్ణయం.. తన మునుపటి అధ్యక్ష పదవీకాలంలో చేసిన చర్యలు, ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా ఉండడం గమనార్హం. ఇందుకు పాక్‌తో తన కుటుంబానికి ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాలే కారణమన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పాకిస్తాన్ పౌరులను తెలివిపరులుగా ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత పాక్‌పై ప్రశంసలు కురిపించారు. అమెరికా-పాకిస్తాన్ సంబంధం బలపడడానికి పాకిస్తాన్, యూఎస్ లో ఉన్న ఫిన్‌టెక్ సంస్థ అయిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ (WLF) మధ్య క్రిప్టోకరెన్సీయే కారణంగా కనిపిస్తోంది. WLF ట్రంప్ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థగా చెబుతారు. ఈ సంస్థలో ఎరిక్ ట్రంప్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, జారెడ్ కుష్నర్ ఉన్నారు. వీరు సమిష్టిగా సంస్థలో గణనీయమైన యాజమాన్య వాటాను కలిగి ఉన్నారు. పాకిస్తాన్లో క్రిప్టో కరెన్సీ వ్యాపారం కారణంగా ఆ దేశంతో ట్రంప్ సాన్నిహిత్యం పెంచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.