అక్షరటుడే, వెబ్‌డెస్క్:Elon Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), టెస్లా అధినేత ఎలన్ మస్క్ మధ్య బ్రోమన్స్ ముగిసింది. ఇద్దరి మధ్య వైరం బాగా ముదిరింది. ట్రంప్, మస్క్ స్నేహం మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది.
ట్రంప్ గెలుపు కోసం అన్ని రకాలుగా అండగా నిలిచిన టెస్లా సీఈవో (Tesla CEO).. ఇప్పుడు ఆయనకు ఎదురు తిరుగడం ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. ట్రంప్ దూకుడు వాణిజ్య విధానాలు అమెరికా(America)ను ఆర్థిక మాంద్యంలో నెట్టే ప్రమాదముందని హెచ్చరించారు. ట్రంప్ ను దగ్గరుండి గెలిపించిన మస్క్(Elon Musk).. ఆయన తక్షణమే తన తప్పుకోవాలని లేకపోతే అమెరికాకు తీవ్ర నష్టమని హెచ్చరించాడు. ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. రిపబ్లికన్లకు ఇంత కూడా కృతజ్ఞత లేకపోవడమా? నేను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయే వారని మస్క్ తన సోషల్ మీడియాలో పేర్కొనడం.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడికి, అమెరికా అధ్యక్షుడికి మధ్య పెరిగిన దూరాన్ని ఎత్తి చూపుతోంది.
Elon Musk | ట్రంప్ పిచ్చి వేషాలు నచ్చకే..
వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ట్రంప్, మస్క్ ను ఒక్కటి చేశాయి. ప్రపంచ కుబేరుడైన మస్క్ ట్రంప్ గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. ఆర్థికంగానే కాకుండా తన సోషల్ మీడియా ‘ఎక్స్’ను సైతం ఇందుకోసం వినియోగించాడు. మొత్తంగా ట్రంప్ ను దగ్గరుండి గెలిపించాడు. ఇందుకు ప్రతిగా ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే, మస్క్కు కీలక బాధ్యతలు అప్పగించాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (Department of Government Efficiency)కి చీఫ్ గా నియమించాడు.
అయితే, ట్రంప్ నాలుగు నెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలు.. ఇద్దరి మధ్య తీవ్ర వైరాన్ని పెంచాయి. ప్రధానంగా వాణిజ్య సుంకాలకు తోడు ఇటీవల తీసుకొచ్చిన ఓ బిల్లు విషయం టెస్లా సీఈవోను నివ్వెరపరిచింది. ప్రపంచ దేశాలపై టారిఫ్స్ (Tariffs) పెంచుతూ వాణిజ్య యుద్దానికి తెర తీసిన అమెరికా అధ్యక్షుడి ఆటలు ఆయనకు నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం బీటలు వారింది. ఇప్పుడు నేరుగా విమర్శలు చేసుకునే పరిస్థితి తలెత్తింది.
Elon Musk | ఆర్థిక మాంద్యం తప్పదన్న మస్క్..
మస్క్, ట్రంప్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. ట్రంప్ సంతకం చేసిన ఖర్చు బిల్లు ‘ది బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్’ (The Big and Beautiful Bill) అని మస్క్ బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ దూకుడు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టవచ్చని టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ మస్క్ తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలను “సూపర్ స్టుపిడ్” అని సోషల్ మీడియాలో పేర్కొన్న ఓ వ్యక్తికి మస్క్ తన ట్విట్టర్ ప్లాట్ ఫాంలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “అమెరికా దివాలా తీస్తే, వారికి మరేమీ పట్టింపు లేదు” అని మస్క్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికా మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి.
Elon Musk | మస్క్ తీరుతో నిరాశ చెందానన్నట్రంప్..
మరోవైపు, ట్రంప్(Trump) కూడా మస్క్ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. మస్క్ తీరు వల్ల నిరాశ చెందానని పేర్కొన్నారు. ఆయన మంచి మిత్రుడే, బిల్లును వ్యతిరేకించడం లేదని వెల్లడించాడు. అయితే ట్రంప్ మాట్లాడుతుండగానే, మస్క్ రియల్ టైమ్లో ఎదురుదాడి చేశాడు. ట్విట్టర్లో ఖండనలను పోస్ట్ చేశాడు. 2024 ఎన్నికల సమయంలో రిపబ్లికన్లకు తన గణనీయమైన ఆర్థిక సహాయాన్ని హైలైట్ చేస్తూ, “ఇంత కృతజ్ఞత లేకపోవడమా” అని ప్రశ్నించాడు. “ఆయనకు అధ్యక్షుడిగా ఇంకా 3.5 సంవత్సరాలే మిగిలి ఉన్నాయి, కానీ నేను ఇంకా 40+ సంవత్సరాలు ఉంటాను” అని మస్క్ మరో పోస్ట్ చేయడం.. ఇద్దరి మధ్య దీర్ఘకాలిక ప్రతిష్టంభనను సూచిస్తుంది.