అక్షరటుడే, వెబ్డెస్క్:Jagtial | ఈ సృష్టిలో అన్ని ప్రేమలకు అనేక అర్థాలు చెప్పొచ్చు.. కానీ ‘అమ్మ ప్రేమ’ను మాత్రం నిర్వచించడం చాలా కష్టం. ఒక తల్లి కేవలం జన్మనివ్వడమే కాదు.. అవసరమైతే ఆమె తన శ్వాసను కూడా తన బిడ్డకు బదిలీ చేస్తుంది. సృష్టిలో అమ్మ ప్రేమకు మించింది ఏదీ లేదు.
తమ పిల్లల కోసం దేనికైనా సిద్ధపడుతుంది తల్లి. అది మనుషులైనా.. జంతువులైనా.. అమ్మ..అమ్మే.. అమ్మ ప్రేమకు ఏదీ సాటి రాదు. చివరకు దైవం కూడా.. అమ్మ తర్వాతే..! తల్లి ప్రేమకు అద్దంపట్టే సంఘటనలు ఎన్నో మనం చూశాం. తాజాగా జరిగిన ఘటనతో మనుషులకే కాదు జంతువులకూ పేగుబంధం ఉంటుందనే అభిప్రాయం మరోసారి రుజువైంది. ఇందుకు సంబంధించిన వీడియో (Video) నెట్టింట వైరల్ అవుతుంది.
Jagtial | ఇది కదా అసలైన ప్రేమంటే..
జగిత్యాల పట్టణం(Jagityala Town)లోని జరిగిన ఘటన అందరిని కదిలించింది. ఏ జీవి అయిన తన బిడ్డకోసం పడే తపనకు నిదర్శనంగా నిలుస్తోంది. జగిత్యాల పట్టణం గోవిందుపల్లె వార్డు(Govindupally Ward)కు చెందిన నరేందర్ ఆవు(Cow) ఈ మధ్యనే లేగ దూడకు జన్మనిచ్చింది. రాత్రి మేతకోసం వెళ్లిన ఆవు ఇంటికి రాలేదు. దీంతో లేగ దూడ పాల కోసం, తల్లి కోసం పడే తపన చూసిన యజమాని నరేందర్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఓ ఆటోలో లేగ దూడతో పట్టణం అంతా తిరిగారు. ఎట్టకేలకు జగిత్యాల కొత్త బస్టాండ్ (Jagityala new bus stand) వద్ద తల్లి ఆవును గుర్తించారు.
ఆటోలో ఉన్న తన బిడ్డను చూసి ఆవు మురిసిపోయింది. బిడ్డకు పాలు ఇచ్చేందుకు ఆటో వెంట పరుగెత్తింది. ఇంటికి చేరే వరకు ఆటో వెంట పరుగులు తీసిన సన్నివేశం, వీక్షకుల హృదయాలను కదిలించింది. తల్లి ప్రేమ వెల్లకట్టలేనిది.. బిడ్డ కోసం తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో ఈ ఆవు, దూడ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిచి వేస్తుంది. ఇలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు సోషల్ మీడియా(Social Media)లో కనిపిస్తూనే ఉంటాయి.