అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | ప్రస్తుతం మనం తింటున్న ఆహార పదార్థాల్లో ఏది అసలుదో.. ఏది కల్తీదో తెలియడం లేదు. ప్రతి దానిని కల్తీ చేసి కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీ పదార్థాలు(Adulterated substances) తయారు చేసి విక్రయిస్తున్నారు. పాల నుంచి మొదలు పెడితే వంట నూనె వరకు ప్రతి దానిని కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కల్తీ దందా జోరుగా సాగుతోంది. మూతబడిన పరిశ్రమల్లో ఎక్కువగా కల్తీ వస్తువులు తయారు చేస్తున్నట్లు గతంలో పోలీసులు గుర్తించారు. తాజాగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్(Adulterated ginger garlic paste) తయారు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని బండ్లగూడ పటేల్ నగర్‌లో FK ఫుడ్ ప్రొడక్ట్ పేరుతో మొహమ్మద్ ఫైసల్ (44) కల్తీ అల్లం – వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు, టాస్క్‌ఫోర్స్ సౌత్-ఈస్ట్ జోన్, బండ్లగూడ పోలీసులు(Bandlaguda Police) ఎఫ్‌కే ఫుడ్ ప్రొడక్ట్‌పై దాడి చేశారు. ₹1.4 లక్షల విలువైన 870 కిలోల కల్తీ పేస్ట్, 4 కిలోల టైటానియం డయాక్సైడ్, 16 కిలోల మోనో సిట్రేట్, 4 కిలోల పసుపు పొడిని స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | ప్రమాదకర రసాయనాలతో తయారీ
ప్రమాదకర రసాయనాలతో కల్తీ పేస్ట్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. టైటానియం డయాక్సైడ్(Titanium Dioxide), మోనో సిట్రేట్(Mono Citrate) వంటి రసాయనాలతో పేస్ట్ తయారు చేసి విక్రయించేవాడు. దీంతో నిందితుడు మహమ్మద్ ఫైసల్‌ను పోలీసులు అరెస్ట్(Police Arrest) చేశారు.