అక్షరటుడే, వెబ్డెస్క్ : Nethanna Bharosa |తెలంగాణ(Telangana)లోని నేత కార్మికుల(Handloom Workers)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక సాయంపై కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఎంతోమంది కార్మికులు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే నేతన్నలకు సాయం చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా నేతన్నకు భరోసా (Nethanna Bharosa scheme) పథకం ప్రవేశ పెట్టింది. తాజాగా పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న నేతన్నలు, అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేతన్నలకు ఏడాదికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు అందించనుంది. ఈ డబ్బులను రెండు విడతల్లో అందించనున్నట్లు పేర్కొంది.
ప్రభుత్వ నిర్ణయంతో 40 వేల మంది చేనేత, అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. కాగా.. నేతన్నకు భరోసా కోసం బడ్జెట్లో రూ.48 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ నిర్ణయంతో నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సిరిసిల్లలో ఎక్కువ మంది నేత కార్మికులు జీవిస్తున్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోను చేనేత కార్మికులు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరికీ ఆర్థిక భరోసా లభించనుంది.