IPL 2025
IPL 2025 | నేడే ఐపీఎల్ ఫైన‌ల్‌.. అంతా సిద్ధం.. వ‌ర్షం ప‌డితే ప‌రిస్థితి ఏంటి?

అక్షరటుడే, వెబ్​డెస్క్:IPL 2025 | గ‌త కొద్ది రోజులుగా క్రికెట్ ప్రియులని ఎంత‌గానో ఉత్సాహ‌ప‌రుస్తున్న ఐపీఎల్ 2025 ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య నేడు హై ఓల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ రెండు జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క టైటిల్ కూడా గెల‌వ‌క‌పోవ‌డంతో పోటీ ఆస‌క్తిక‌రంగా మార‌నుంది. మ‌రోవైపు ఈసారి ఒక కొత్త ఛాంపియన్ ఆవిర్భవించనుంది. ఈ రెండు జట్లు మొదటి సీజన్ నుంచి లీగ్‌లో భాగంగా ఉన్నాయి. రెండూ తమ మొదటి టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాయి.

IPL 2025 | నువ్వా..నేనా?

అయితే మంగళవారం అహ్మదాబాద్‌(Ahmedabad)లో వర్షం పడే అవకాశం ఉన్నందున మ్యాచ్‌కు అడ్డంకిగా మారనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం నగరంలో కొంత వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ ఉండనుండగా.. సాయంత్రం నాటికి 27 డిగ్రీలకు తగ్గనుందని అంచనా. ఆక్యూవెదర్ ప్రకారం పగటిపూట ఒక గంట వర్షం పడవచ్చు. వాతావరణం శాఖ(Weather Department) ప్రకారం సాయంత్రం కూడా వర్షం పడే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 51% వర్ష సూచన ఉంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ఉష్ణోగ్రతలు 30ల మధ్యలో ఉంటాయి. అధిక తేమ కూడా ఉంటుంది. అయితే, రాత్రి పూట వర్షం పడే అవకాశాలు తగ్గుతాయి. బీసీసీఐ(BCCI) ఇప్పటికే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కాకుండా ఉండేందుకు రిజర్వ్ డే (జూన్ 4)తో పాటు, అదనంగా 120 నిమిషాల సమయాన్ని కూడా కేటాయించింది.

రెండు రోజులూ వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం నిర్ణయించబడకపోతే పంజాబ్ కింగ్స్ ట్రోఫీ(Trophy)ని అందుకుంటుంది. ఎందుకంటే వారు పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) కంటే ముందంజలో ఉన్నారు. చూడాలి మ‌రి ఈ సారి ఎవ‌రు విజేతగా నిలుస్తారనేది. ఎవ‌రు గెలిచిన హార్ట్ బ్రేకింగ్ అంటూ ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి(Rajamouli) ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.