అక్షరటుడే, వెబ్‌డెస్క్: Russia-Ukraine peace talks : ఇస్తాంబుల్(Istanbul)లో సోమవారం జరిగిన రెండో రౌండ్ రష్యా – ఉక్రెయిన్ శాంతి చర్చలు ప్రారంభమైన గంటలోపే ముగిశాయి. ఈ చర్చల సందర్భంగా రష్యా పాక్షికంగా రెండు, మూడు రోజుల పాటు యుద్ధ విరామాన్ని ప్రతిపాదించింది.
చర్చల సందర్భంగా రెండు దేశాలు మరణించిన తమ సైనికుల మృతదేహాలను మార్చుకునేందుకు అంగీకరించాయి. మొత్తం 6,000 మంది సైనికుల మృతదేహాలను మార్పిడి చేసుకునేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల బృందాలు పాల్గొన్నాయి. ఉక్రెయిన్ తరఫున రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్(Defense Minister Rustam Umerov) నేతృత్వం వహించగా, రష్యా తరఫున అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సలహాదారు వ్లాదిమిర్ మెడిన్‌స్కీ(President Vladimir Putin’s advisor Vladimir Medinsky) పాల్గొన్నారు. ఉక్రెయిన్ ప్రతినిధుల్లో చాలామంది సైనిక యూనిఫామ్‌లో చర్చలకు హాజరయ్యారు.
చర్చల అనంతరం ఉక్రెయిన్ ప్రతినిధి సెర్గీ కిస్లిట్సియా మీడియాతో మాట్లాడారు. “రష్యా పునరావృతంగా అన్‌కండిషనల్ సీజ్‌ఫైర్‌ను తిరస్కరించింది. ఈ సమయంలో యుద్ధాన్ని ఆపితే ఉక్రెయిన్ పునఃసంగ్రహణకు అవకాశం లభిస్తుందని రష్యా భావిస్తోంది” అని వెల్లడించారు.
రష్యా ముఖ్య ప్రతినిధి మెడిన్‌స్కీ మాటలు మరోలా ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే.. “రెండు, మూడు రోజుల పాటు యుద్ధ విరామాన్ని కొన్ని ప్రాంతాల్లో పాటించాలని మేము ప్రతిపాదించాం. దీనివల్ల మరణించిన సైనికుల మృతదేహాలను సేకరించేందుకు వీలు కలుగుతుంది” అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. జూన్ 20 నుంచి 30 మధ్య మరోసారి చర్చలు నిర్వహించాలని రష్యాకు ఉక్రెయిన్ ప్రతిపాదన చేసింది. రెండు దేశాల అధినేతల(ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్)(Ukrainian President Volodymyr Zelensky, Russian President Vladimir Putin) మధ్య ప్రత్యక్షంగా చర్చ జరిగితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఉక్రెయిన్ భావిస్తోంది.
గత నెల(మే 16న)లోనూ ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చలు రెండు గంటల్లోపే ముగిశాయి. అప్పట్లో పెద్దఎత్తున ఖైదీల మార్పిడి గురించి మాత్రమే ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.
Russia-Ukraine peace talks : తాజా ఉద్రిక్తతలు?
ఉక్రెయిన్ వర్గాల కథనం ప్రకారం.. రష్యాలోని ఆర్క్టిక్, సైబీరియా, దూర తూర్పు ప్రాంతాల్లో(Arctic, Siberia, Far East) ఉన్న వైమానిక స్థావరాలపై దాడి చేసి 40కి పైగా యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఇవి ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 7 వేల కి.మీ దూరంలో ఉన్నాయి. మరోవైపు, రష్యా 2022 నుంచి ఇప్పటి వరకు ఒకేరోజులో అత్యధికంగా 472 డ్రోన్ల(drones)ను తమ దేశంపై ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురతాయన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.