అక్షరటుడే, హైదరాబాద్: kaleswaram commission : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం(Kaleswaram lift irrigation scheme)లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) కుంగుబాటుపై కీలక అడుగు పడింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(Vigilance and Enforcement).. తన పూర్తి స్థాయి నివేదికను సోమవారం ప్రభుత్వానికి అందించింది.
ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. అలాగే ఈ నివేదికలో పలువురు ఈఎన్సీలతో పాటు ప్రస్తుత సీఈలు, ఎస్‌ఈల పేర్లను సైతం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని ఈ నివేదికలో సూచించింది. ఏడుగురు రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరంతా క్షేత్ర స్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని సదరు నివేదికలో విజిలెన్స్ పేర్కొంది.
kaleswaram commission : ఏం జరుగుతోంది..?
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి 57 మంది అధికారులను బాధ్యులుగా విజిలెన్స్ తేల్చింది. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్లో పలువురు మాజీ ఈఎన్సీలు ప్రస్తుత సీఈలు, ఎస్‌ఈల పేర్లు ఉండగా, 33 మంది ఇంజినీర్లపై పెనాల్టీ వేయాలని విజిలెన్స్ సూచించింది. ఏడుగురు రిటైర్డ్ ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
క్షేత్ర స్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదికలో విజిలెన్స్ స్పష్టం చేసింది. మేడిగడ్డ కుంగడానికి ప్రభుత్వ ఖజానాకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించిన 17 మంది అధికారులు, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఐపీసీ సెక్షన్లు (IPC sections) 120 (B), 336, 409, 418, 423, 426, ఆనకట్ట భద్రతా చట్టం-1988 (Dam Safety Act-1988), PDPP చట్టం, 1984(PDPP Act, 1984) ప్రకారం వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రిపోర్ట్ ఇచ్చింది.
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5న విచారణకు రావాలని ఇప్పటికే కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే.. ఆ రోజు తాను రాలేనని కేసీఆర్ కమిషన్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న వస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం.
జూన్ 5న విచారణకు కేసీఆర్(KCR) రావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. అలాగే జూన్ 6న ఎమ్మెల్యే హరీశ్‌రావు, జూన్ 9న ఎంపీ ఈటల రాజేందర్ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ముగ్గురు కమిషన్ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రాజెక్టు, ఆనకట్టల నిర్మాణంపై అప్పటి ప్రభుత్వ పెద్దలను సైతం కమిషన్ విచారించనుంది.
సీఎంగా, కొంతకాలం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న కేసీఆర్, కొంతకాలం ఇరిగేషన్, ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావు, కొంతకాలం ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ పని చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ అనంతరం పరిణామాల దృష్ట్యా బీజేపీలో చేరినా కూడా కమిషన్ విచారణకు పిలిచింది. సహజ న్యాయసూత్రం ప్రకారం ముగ్గురి వాదనలను వినాలని కమిషన్ నిర్ణయించింది. ముగ్గురి వాగ్మూలాలను పీసీ ఘోష్ కమిషన్ రికార్డ్ చేసుకోనుంది. మరి ఈ పరిణామాలు చూస్తుంటే.. అధికారులతో పాటు కీలక నేతల అరెస్టు తప్పదేమోనని అనిపిస్తోంది.