Blood Test
Blood Test | దీర్ఘాయుష్షు కోసం త‌ప్ప‌ని స‌రిగా చేయించుకోవ‌ల్సిన ర‌క్త ప‌రీక్ష‌లు ఏంటంటే..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Blood Test | ఒక‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ 80 ఏళ్లు ఈజీగా బ్ర‌తికేవారు. కానీ రానురాను లైఫ్ స్పాన్ (Life Span) త‌గ్గుతూ వస్తోంది. ఇప్పుడు 50 ఏళ్లు బ్ర‌త‌క‌డ‌మే గ‌గ‌నం అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. తినే తిండి, పీల్చే గాలి క‌లుషితం కావ‌డంతో 70, 80 ఏళ్లు బతికే ప‌రిస్థితి లేదు. అయితే దీర్ఘాయుష్షును కాపాడుకోవ‌డం కోసం కసరత్తులు, పౌష్టికాహారం (nutritious food) తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొంద‌రు ప్రయత్నిస్తున్నారు. వీటితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వైద్య పరీక్షలు (Medical Tests) కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా చేయించుకునే వైద్య పరీక్షలతో అనేక రోగాలను తొలి దశలో ఉండగానే గుర్తించవచ్చు. మ‌నం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్ర‌తి ఆరు నెల‌ల‌కొక‌సారి త‌ప్ప‌నిస‌రిగా ఈ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అవేంటంటే..

  1. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ : ఈ పరీక్ష ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరాయిడ్స్ లెవెల్స్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. తద్వారా గుండె వ్యాధుల ముప్పు ఉందో లేదో అంచనా వేయవచ్చు. ప్రాణాంతక వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు.
  2. బ్లడ్ షుగర్ టెస్ట్ : ఈ పరీక్ష ద్వారా డయాబెటిస్ లేక ప్రీడయాబెటిస్ స్థితి గురించి తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్‌ను HBA1C టెస్ట్ అని కూడా అంటారు. తద్వారా గత మూడు నెలల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది.
  3. లివర్ ఫంక్షన్ టెస్టులు : కాలేయ పనితీరును ముదింపు వేసేందుకు లివర్ ఫంక్షన్ టెస్టులు (Liver Function Test) అవసరం. ఈ పరీక్షల్లో భాగంగా రక్తంలో వివిధ ఎంజైములు, ప్రొటీన్లు, బిలిరుబిన్ స్థాయిని చెక్ చేస్తారు.
  4. కిడ్నీ ఫంక్షన్ టెస్టులు : ఈ పరీక్షలతో కిడ్నీ (Kidney) పనితీరుపై ఓ కన్నేసి ఉంచొచ్చు. క్రియాటినైన్‌తో పాటు బ్లడ్ యూరియా నైట్రోజన్‌ ఎంతుందో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు చేస్తారు. క్రియాటినైన్, బ్లడ్ యూరియా స్థాయిలో అధికంగా ఉంటే కిడ్నీలో ఏదో సమస్య ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యను చక్కదిద్దని పక్షంలో కిడ్నీలు విఫలమయ్యే ప్రమాదం ఉంది.
  5. విటమిన్ డి టెస్ట్: శరీరంలో ఎముకల బలోపేతానికి, ఎదుగుదలకు అత్యంత కీలకమైంది విటమిన్ డి (Vitamin D). ఇది శరీరంలో ఏ మేరకు ఉందో తెలుసుకునే టెస్ట్. 30 ఏళ్లు దాటితే తప్పకుండా ఈ టెస్ట్ అవసరమవుతుంది.

అలానే సీబీపీ, సీబీజీ టెస్ట్‌లు(CBP and CBG tests) కూడా చేయించుకుంటే ఇది మ‌న బ్ల‌డ్ ఎలా ఉందో తెలుసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. థైరాయిడ్ టెస్ట్, హార్మోన్ ప్యానెల్ టెస్ట్ (Thyroid test and hormone panel test) వంటివి కూడా చేయించుకోవాలి. ప్రతి మనిషికి 30 ఏళ్లంటే అత్యంత కీలకంగా భావించాలి. ఈ వయస్సులోనే ఆరోగ్యపరంగా మార్పులు సంభవిస్తుంటాయి. కొన్ని వ్యాధుల ముప్పు ఉంటుంది. ఈ వ్యాధుల్నించి రక్షించుకోవాలంటే ముందుగా ఈ రక్త పరీక్షలు అవసరమవుతాయి.