Miss World 2025 | అందాల ప్రపంచ సుందరి కన్నీటి ప్రయాణం.. మనోధైర్యమే ఆమె బలం..
Miss World 2025 | అందాల ప్రపంచ సుందరి కన్నీటి ప్రయాణం.. మనోధైర్యమే ఆమె బలం..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Miss World 2025 : థాయ్‌లాండ్‌ అందాల భామ ఓపల్ సుచాత చువాంగ్‌ (Opal Suchata Chuangsri) మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలుచుకున్నారు. హైదరాబాద్‌లో మే 31, 2025న జరిగిన 72వ మిస్ వరల్డ్ ఫైనల్‌లో ఆమె ఈ గౌరవం దక్కించుకున్నారు. ఇథియోపియా(Ethiopia)కు చెందిన హాసెట్ డెరెజె అడ్మస్సు ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ప్రపంచంలోని 108 దేశాల సుందరీమణులను తలదన్ని ఓపల్​ సుచాత చువాంగ్​ ప్రపంచ సుందరి వజ్రాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో అంతర్జాతీయ స్థాయిలో థాయ్​లాండ్​కు గుర్తింపు లభించినట్లు అయింది.

ప్రపంచ సుందరిగా ఎంపికతో ఓపల్ సుచాత చువాంగ్‌ రూ. 8.5 కోట్ల నగదు బహుమతి గెలుచుకున్నారు. దీంతో పాటు 1,770 క్యారెట్ల వజ్రాల(1770 carats of diamonds)తో తయారైన కిరీటం (miss crown) సొంతం చేసుకున్నారు. వీటితో పాటు ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్రను చేయొచ్చు. కాగా, ఆమె ఈ గెలుపు వెనుక ఏళ్ల తరబడి కష్టార్జితం దాగి ఉంది. ఎన్నో కన్నీటి జారలు ఉన్నాయి. ఆమె జీవితంలోకి తొంగి చూస్తే.. కన్నీరు ఆగదనే చెప్పాలి.

Miss World 2025 : వ్యక్తిగత వివరాలు..

  • ఓపల్ సుచాత చువాంగ్‌
    పుట్టిన తేదీ: మార్చి 20, 2003
  • స్థలం: ఫుకెట్, థాయ్‌లాండ్
  • విద్య: థామసాట్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో రాజకీయ శాస్త్రం చదువుతున్నారు
  • భాషలు: ఇంగ్లీష్, థాయ్, చైనిస్
  • ప్రాజెక్ట్: “Opal for Her” – బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు ఓపల్ సుచాత చువాంగ్‌ ప్రారంభించిన సామాజిక కార్యక్రమం

Miss World 2025 : యుక్త వయసులోనే ఆపద..

ఓపల్ సుచాత చువాంగ్‌ను 16 సంవత్సరాల వయస్సులోనే ప్రమాదకరమైన క్యాన్సర్ ​లాంటి విపత్తు కబంధ హస్తాల్లో బంధించింది. ఓపల్‌కు 10 సెం.మీ. పరిమాణంలో బ్రెస్ట్ ట్యూమర్ ఏర్పడింది. ఆమె రొమ్ములో నిరపాయమైన కణితి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. శస్త్రచికిత్సతో వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపర్చారు.

సాధారణంగా ఈ భయంకరమైన అనుభవం ఎంత మనో నిబ్బరం ఉన్న మనుషులనైనా కుంగదీస్తుంది. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న యువతులనైతే మరీను. కానీ ఓపల్​ సుచాత అలా కాదు. మనో నిబ్బరంతో నిలబడ్డారు. ప్రమాదకరమైన రోగాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. అంతటితో ఆగలేదు. తన మనస్సును అందాల పోటీల వైపు మళ్లించారు. దీనికితోడు సేవా కార్యక్రమాలపైనా దృష్టి సారించారు. అలా ఓపల్ “Opal for Her” అనే సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించి, కొనసాగిస్తున్నారు.

ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్​పై అవగాహన, మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడానికి అందాల పోటీల వేదికను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆమె “బ్యూటీ విత్ ఎ పర్పస్” (Beauty with a Purpose) నిబద్ధతకు నిదర్శనంగా పేర్కొనవచ్చు.

Miss World 2025 : అందాల పోటీ ప్రయాణం ఇలా..

  • 2021: సుచాత తన మొదటి అందాల పోటీ మిస్ రత్తనకోసిన్ పాల్గొన్నారు.
  • 2022: 18 సంవత్సరాల వయస్సులో.. మిస్ యూనివర్స్ థాయ్​లాండ్​ పోటీలో మూడో రన్నరప్​గా నిలిచారు. మొదటి రన్నరప్ నికోలిన్ లిమ్స్నుకాన్ రాజీనామా చేయడంతో సుచాత రెండో రన్నరప్​ అయ్యారు.
  • 2024: మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్‌గా ఎంపికయ్యారు. తర్వాత మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో మూడవ రన్నరప్‌గా ఓపల్​ నిలిచారు.
  • 2025: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్‌గా ఎంపికయ్యారు. తాజాగా మిస్ వరల్డ్ 2025 కిరీటం సొంతం చేసుకున్నారు.