అక్షరటుడే, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, భారతీయ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి రెండు కళ్ల లాంటివని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోమని హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణకు ఇచ్చినట్లేనన్నారు.
హైదరాబాద్ బంజారహిల్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని శనివారం కవిత ప్రారంభించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ జాగృతి ప్రారంభించి 18 ఏళ్లయ్యింది. తెలంగాణ ప్రతి ఉద్యమంలోనూ జాగృతి భాగమైంది. కేసీఆర్, ప్రొ.జయశంకర్ స్ఫూర్తితో జాగృతి ఏర్పాటైంది. ప్రొ.జయశంకర్ చెప్పిన తర్వాతే తెలంగాణ జాగృతి స్థాపించాం. ప్రొ.జయశంకర్ నాకు దిశానిర్దేశం చేశారు. ఇకపై కొత్త కార్యాలయం నుంచే జాగృతి కార్యకలాపాలు జరుగుతాయి’ అని అన్నారు. కేసీఆర్ రెండు కళ్లలా పని చేస్తామని, ఒక కన్ను బీఆర్ఎస్ అయితే, ఇంకోటి తెలంగాణ జాగృతి అని చెప్పారు. అయితే, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం కవిత స్పందించలేదు.
MLC Kavita Strong Warning : నోటీసులకు వ్యతిరేకంగా ధర్నా
కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. అది కాళేశ్వరం కమిషనా.. కాంగ్రెస్ కమిషనా? అని ప్రశ్నించారు. ‘అసలు ఎందుకు నోటీసులు ఇస్తారు. తెలంగాణ తెచ్చినందుకా..? తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసినందుకా? ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌కు నోటిసులిస్తారా..? కేసీఆర్‌కు నోటీసులివ్వడమంటే తెలంగాణకు ఇచ్చినట్టే‘ అని కవిత వ్యాఖ్యానించారు.
కేసీఆర్ పిడికిలి బిగిస్తేనే తెలంగాణ వచ్చిందన్న కవిత.. కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా చేపడుతున్నామని చెప్పారు.
రేవంత్.. జై తెలంగాణ అనండి
కేసీఆర్ పోరాడితేనే తెలంగాణ వచ్చిందని, అందువల్లే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కవిత అన్నారు. కానీ రేవంత్ ఎప్పుడూ జై తెలంగాణ అనలేదని గుర్తుచేశారు. ‘ప్రస్తుత సీఎం కనీసం జై తెలంగాణ కూడా అనరు. రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అని నినదించాలి. తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు అమరవీరులకు నివాళులర్పించాలి. నివాళులర్పించని వారికి కుర్చీలో కూర్చునే అర్హత లేదని’ తెలిపారు. ఉద్యమకారులపైకి గన్ ఎక్కుపెట్టిన వాళ్లు.. ప్రస్తుతం రాష్ట్రానికి సీఎం అయ్యారని కవిత దుయ్యబట్టారు.
జాగృతి పోరాటం
తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై జాగృతి పోరాటం చేస్తుందని కవిత చెప్పారు. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోతుంటే రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ‘వేరే రాష్ట్రం తెలంగాణ నీళ్లు తీసుకెళ్తుంటే మాట్లాడలేని పరిస్థితి రేవంత్‌ది. తన గురువు చంద్రబాబు నీళ్లను ఎత్తుకెళ్తుంటే నోరు మెదపడం లేదు. బనకచర్ల ప్రాజెక్ట్ పై రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదు..? వీరి మౌనం కారణంగా గోదావరి నీళ్లు శాశ్వతంగా దూరం కాబోతున్నాయి. ఏపీ ప్రయోజనాల కోసమే రేవంత్ పనిచేస్తున్నారు’ అని ఆరోపించారు.
ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా.. నిధులు తేవడంలో విఫలం..
మరోవైపు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు నిధులు తేవడంలో విఫలమయ్యారని కవిత విమర్శించారు. బడ్జెట్‌లో నిధులు తీసుకురారు. పక్క రాష్ట్రం నీళ్లు ఎత్తుకెళ్తుంటే కేంద్రంపై ఒత్తిడి తీసుకురారని ఆరోపించారు. ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాల్లో వాటా కాపాడకపోతే.. తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందన్నారు. ప్రభుత్వ పథకానికి రాజీవ్ యువ వికాసం అని పేరు పెట్టడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ పథకాలకు తెలంగాణ వారి పేర్లే పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యువ వికాసం అని ఉండాలి.. కానీ రాజీవ్ యువ వికాసం అని కాదని అన్నారు. అవసరమైతే పీవీ నర్సింహారావు పెట్టాలి తప్పితే రాజీవ్ పేరు ఏమిటని ప్రశ్నించారు.